కమ్యూనిస్టులు లేకుండానే మునుగోడులో గెలిచారా?: హరీశ్ రావు పై సీపీఐ నేత కూనంనేని ఫైర్
హరీశ్ రావు పై లెఫ్ట్ లీడర్ కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తాము లేకుండానే మునుగోడులో గెలిచారా? తాము లేకుంటే మునుగోడులో బీజేపీని కట్టడి చేయగలిగేవారా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. కమ్యూనిస్టు పార్టీలకు కార్యకర్తలు లేరని మంత్రి ఎద్దేవా చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. కమ్యూనిస్టులు లేకుండానే మునుగోడులో బీఆర్ఎస్ గెలిచిందా? అంటూ ప్రశ్నించారు. తాము లేకుంటే బీజేపీని బీఆర్ఎస్ అడ్డుకునేదా? అని నిలదీశారు. హరీష్ రావు తన వ్యాఖ్యలను గుండె పై చేయి వేసుకుని చెప్పగలరా? అంటూ అడిగారు.
ప్రతి ఊరిలో కమ్యూనిస్టులు ఉంటారని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు లేని ప్రాంతాన్ని హరీశ్ రావు చూపించగలడా? అంటూ ప్రశ్నించారు. సమస్యలపై స్పందించే.. ప్రశ్నించే ప్రతి వ్యక్తీ కమ్యూనిస్టేనని అన్నారు.
హరీశ్ రావు అలా ఎందుకు అన్నాడో తనకు తెలియదని కూనంనేని అన్నారు. అయితే, బీఆర్ఎస్‌తో తాము ఇంకా స్నేహంగానే ఉన్నామని, బీఆర్ఎస్ కూడా అలాగే ఉన్నదని అనుకుంటున్నామని వివరించారు. ఎన్నికల వరకు వైఖరులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేమని, ఎన్నికల్లో కలిసి పని చేస్తామా? లేదా? అనే విషయంపై ఇప్పుడే స్పష్టత ఇవ్వడం సాధ్యం కాదని తెలిపారు.
Also Read: కవిత నీ దారి నువ్వు చూసుకో.. నా పని నేను చేసుకుంటా..: ఎంపీ ధర్మపురి అరవింద్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సింగిల్‌గానే బరిలో దిగుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హరీశ్ రావు కమ్యూనిస్టు పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. కమ్యూనిస్టులకు బలమే లేదని, కార్యకర్తలు లేరని అన్నారు.