తొలిరోజే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడెక్కాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం రణరంగంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సభ్యులు చెలరేగిపోయారు. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వద్ద ఉన్న హెడ్ ఫోన్ గవర్నర్ వైపు విసిరికొట్టారు. దీంతో సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది.

అయితే కోమటిరెడ్డి విసిరిన హెడ్ ఫోన్ గవర్నర్ కు తగలలేదు కానీ.. గవర్నర్ పక్కనే ఉన్న శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కన్ను భాగంలో తగిలింది. దీంతో ఆయనకు స్వల్పంగా గాయమైంది. అసెంబ్లీలోని డిస్పెన్సరీలో స్వామిగౌడ్ కు ప్రాథమిక చికిత్స జరిపించారు. కంటి భాగంలో దెబ్బ తగలడంతో గాయానికి కట్టు కట్టి ప్రాథమిక చికిత్స చేశారు.  అనంతరం  స్వామి గౌడ్ ను సరోజిని కంటి ఆసుపత్రికి తరలించారు. స్వామిగౌడ్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి వివరాలు అందాల్సి ఉంది.

విచారం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి

కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్ ఫోన్ శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కు తగలడంపై కోమటిరెడ్డి స్పందించారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తాను, ఎమ్మెల్యే సంపత్ కుమార్ కలిసే హెడ్ ఫోన్ విసిరి కొట్టామన్నారు. కానీ గవర్నర్ ను టార్గెట్ చేసి విసిరితే ఆ హెడ్ ఫోన్ దురదృష్టవశాత్తు శాసనమండలి ఛైర్మన్ కు తగిలిందని బాధపడ్డారు. మరికొద్దిసేపట్లో సరోజిని కంటి ఆసుపత్రికి పోయి స్వామి గౌడ్ ను పరామర్శిస్తామని కోమటిరెడ్డి చెప్పారు. గాయపడిన స్వామిగౌడ్ కు చికిత్స జరిపిన వీడియో కింద ఉంది చూడొచ్చు.