అలా జరిగి వుంటే తెలంగాణ పరిస్ధితి మరోలా వుండేది .. చిదంబరం కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం తెలంగాణ విషయంగా కీలక వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదన్నారు. తెలంగాణలో ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని చిదంబరం దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ. చిదంబరం తెలంగాణ విషయంగా కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం ప్రసంగిస్తూ.. 2014లో తెలంగాణ ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందేదన్నారు. మోడీ తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ను తిడతారని.. కేసీఆర్ కూడా మోడీని తిడతారని దుయ్యబట్టారు. కానీ వీరు తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడరని చిదంబరం ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: బీఆర్‌ఎస్ మేనిఫెస్టో కొత్త అబద్ధాల మూటే.. : రేవంత్ రెడ్డి
దేశంలో క్రైస్తవులు ఆర్ధిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో వుందని చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని.. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని చిదంబరం దుయ్యబట్టారు.
హైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్‌లో 45 శాతం మంది యువకులే వున్నారని.. తన జీవితంలో అలాంటి సమావేశం చూడలేదని ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో మార్పు తథ్యమని చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వంలో మైనార్టీలు భయంతో జీవిస్తున్నారని.. దేశంలో మతపరమైన స్వేచ్ఛ అణిచివేయబడిందని ఆయన ఆరోపించారు.