గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తనను సరిగ్గా ఉపయోగించుకుందని, కానీ, ఇప్పుడు తనను ఉపయోగించుకోవడం లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అప్పటి నాయకత్వం ఇప్పటి రాష్ట్ర శాఖలో లేకుండా పోయిందని వాపోయారు. 

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంది. కర్ణాటక జోష్‌ను ఇంకా కొనసాగించాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఐకమత్యం కోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినా.. ఏదో రకంగా అసంతృప్తి బయట పడుతూనే ఉన్నది. తాజాగా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలకమైన కామెంట్లు చేశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై ఆయన విమర్శలు చేశారు. నాయకత్వం తనను సరిగా ఉపయోగించుకోవడం లేదని పరోక్షంగా రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రభుత్వం కోసం మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు తనను మంచిగా ఉపయోగించుకున్నట్టు చెప్పారు. వారి తరహాలో ఇప్పటి రాష్ట్ర నాయకత్వం తనను సరిగా ఉపయోగించుకోవడం లేదని వివరించారు.

మాజీ ముఖ్యమంత్రులు తనకు ఏ పని చెప్పినా సమర్థంగా చేసి పెట్టేవాడినని జగ్గారెడ్డి అన్నారు. ముఖ్యమైన టాస్క్‌లనూ పూర్తి చేశానని వివరించారు. తనకు అప్పజెప్పిన పని పూర్తయ్యే వరకూ వారు ఎప్పటికప్పుడు పురోగతిని అడిగి తెలుసుకునే వారని గుర్తు చేసుకున్నారు. సీఎం కావడానికి వైఎస్ఆర్ ఎంత కష్టపడ్డారో.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర్ రెడ్డి అంతే కష్టపడ్డారని జగ్గారెడ్డి తెలిపారు.

Also Read: పార్లమెంటులో నేడు రాహుల్ గాంధీ అడుగుపెట్టేనా? అన్ని కళ్లు స్పీకర్ పైనే, ఎందుకంటే?

కానీ, గత రెండేళ్లుగా తమ పార్టీలో అలాంటి నాయకత్వం కనిపించడం లేదని జగ్గారెడ్డి వాపోయారు. సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో ఆదివారం చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.