బీఆర్ఎస్ ఎంత అవినీతి చేసినా కేసులుండవు .. 100 రోజుల్లో కేసీఆర్ను గద్దె దించుతాం : రాహుల్ గాంధీ
బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పైకి విడి విడిగా కనిపిస్తున్నా వాళ్లంతా ఒక్కటేనన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడినా ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టలేదని ఆయన దుయ్యబట్టారు. 100 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పైకి విడి విడిగా కనిపిస్తున్నా వాళ్లంతా ఒక్కటేనన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగిస్తూ.. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలపై పోరాడుతున్నామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చామో.. అదే విధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడినా ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెట్టలేదని ఆయన దుయ్యబట్టారు. బీజేపీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్ధతుగా నిలిచిందని రాహుల్ గుర్తుచేశారు. మోడీ కనుసైగ చేస్తే చాలు బీఆర్ఎస్ , ఎంఐఎం మద్ధతు ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. విపక్ష నేతలపై మోడీ సర్కార్ ఎన్నో కేసులు పెట్టిందని.. కాంగ్రెస్ సభకు ఆటంకం కలిగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ప్రయత్నించాయని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: మహిళలకు 2500 , 10 లక్షల ఆరోగ్య బీమా.. తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ప్రకటించిన సోనియా
తెలంగాణను కేవలం ఒక్క కుటుంబం కోసమే ఇవ్వలేదన్నారు. రైతులు, మహిళలు, విద్యార్ధుల కోసం తెలంగాణ ఇచ్చామని.. కానీ ఫలితం మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవిస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. 100 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. కేబినెట్ ప్రమాణ స్వీకారం జరిగిన రోజే కర్ణాటకలో హామీల అమలుకు శ్రీకారం చుట్టామని రాహుల్ తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పాలన వున్నట్లే దేశంలో మోడీ పరిపాలన వుందని ఆయన చురకలంటించారు.