మహిళలకు రూ .2500 , 10 లక్షల ఆరోగ్య బీమా.. తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు ప్రకటించిన సోనియా
తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు ప్రకటించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ . వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ అండగా ఉండాలని ఆమె కోరారు. ఈ గ్యారెంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని సోనియా వ్యాఖ్యానించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తున్నట్లు ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభకు హాజరైన సోనియా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఆరు వాగ్ధానాలు ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అన్ని వర్గాలకు మేలు జరిగేలా చేయాలనేదే తన స్వప్నం అని సోనియా అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజలందరూ అండగా ఉండాలని ఆమె కోరారు. తెలంగాణను తామే ఇచ్చామని, ఇకపై రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని సోనియా స్పష్టం చేశారు. ఈ గ్యారెంటీ స్కీంలు ప్రకటించడం పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె వ్యాఖ్యానించారు.
- మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500
- పేద మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్
- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు సాయం
- చేయూత పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్య బీమా
- యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల వరకు సాయం.
- చేయూత కింద నెలకు రూ.4వేల పింఛను
- రైతు భరోసా కింద ఏటా రైతుకు రూ.15 వేలు. కౌలు రైతులకు కూడా పథకం వర్తింపు
- భూమి లేని నిరుపేదలు, కూలీలకు ఏటా రూ.12 వేలు
- వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్