Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీయేలోకి కేసీఆర్, సీఎంగా కేటీఆర్ .. రేవంత్ చెప్పేది ఇదే : మోడీ వ్యాఖ్యలపై మాణిక్యం ఠాగూర్ స్పందన

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు సిద్ధపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్.  గత రెండేళ్లుగా రేవంత్ రెడ్డి ఇదే విషయం చెబుతున్నారని మాణిక్యం ఠాగూర్ గుర్తుచేశారు. 

congress mp manickam tagore reacts on pm narendra modi comments on telangana cm kcr ksp
Author
First Published Oct 3, 2023, 7:59 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎన్డీయేలో చేరేందుకు సిద్ధపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి .. ఎన్డీయేలో చేరాలనుకున్న సంగతి మోడీ వ్యాఖ్యలతో బయటపడిందన్నారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్ కోరుకున్నది నిజమని .. గత రెండేళ్లుగా రేవంత్ రెడ్డి ఇదే విషయం చెబుతున్నారని మాణిక్యం ఠాగూర్ గుర్తుచేశారు. 

అంతకుముందు నిజామాబాద్ జిల్లా ఇందూరులో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీ వచ్చి తనను కలిశారని .. ఎన్డీయేలో చేరతామని అడిగారని తెలిపారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత తెలంగాణ తరపున గట్టిగా పోరాడాలని బీజేపీ నిర్ణయించిందని ప్రధాని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కేసీఆర్ తనకు స్వాగతం పలకడానికి వచ్చే వారని, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయిందన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి బీజేపీకి ఇస్తానని కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను అడిగారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: నేను సీఎం కావడానికి మీ పర్మిషన్ ఎందుకు .. మీరు భయపెడితే భయపడం : మోడీకి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ ప్రజల డబ్బును కర్ణాటకలో ఖర్చు పెట్టారని మోడీ ఆరోపించారు. దక్షిణ భారతదేశాన్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు. ఆలయాల సంపదను తీసుకుంటున్నారని.. కానీ మైనార్టీ ప్రార్ధనా స్థలాల జోలికి మాత్రం వెళ్లరని దుయ్యబట్టారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని తాను చెప్పానని మోడీ గుర్తుచేశారు. కర్ణాటక ఎన్నికల తరహాలో బీఆర్ఎస్ డబ్బులు కుమ్మరించాలని చూస్తున్నారని ప్రధాని ఆరోపించారు. 

కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరారని.. ఇది రాజరికం కాదని తాను కేసీఆర్‌కు చెప్పానని ప్రధాని స్పష్టం చేశారు. ప్రజలు ఆశీర్వదించిన వారే పాలకులు అని తాను చెప్పానని మోడీ వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లది ఒకటే సిద్ధాంతమని.. ఎన్నికలకు ముందు వాగ్థానాలు ఇవ్వడం, ఎన్నికల తర్వాత వాటిని మర్చిపోవడం వాళ్ల పాలసీ అని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో కాంగ్రెస్ అల్లాడుతోందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ డబ్బులు అందజేసిందని ప్రధాని ఆరోపించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios