హైదరాబాద్:  టీపీసీసీ చీఫ్ నియామకంపై పార్టీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకొన్నా స్వాగతిస్తానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు.గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.  టీపీసీసీ చీఫ్ నియామకం విషయంలో  పార్టీలోని నాయకులు చీలిపోకుండా నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

టీపీసీసీ చీఫ్ పదవి రేసులో తన పేరు అధిష్టానం  పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో 2017లో  సంగారెడ్డిలో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

also read:టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత: సోనియాకు ఐదు పేర్లిచ్చిన ఠాగూర్

కొత్తగా వచ్చిన ఇంచార్జీ తన కార్యక్రమాల గురించి తెలుసుకోకపోవడం తనలాంటి ఆర్గనైజర్ పేరును పార్టీ నాయకత్వానికి పంపకపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు.టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడ ఉన్నట్టుగా జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకొంది.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్  టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం ఐదుగురు నేతల పేర్లను పార్టీ చీఫ్ సోనియా గాంధీకి ఇవాళ అందించారు.

మరో మూడు రోజుల పాటు టీపీసీసీ చీఫ్ ఎంపిక కోసం పార్టీ నాయకత్వం సమాలోచనలు జరిపే అవకాశం ఉంది.  ఐదు రోజుల తర్వాత  టీపీసీసీ చీఫ్ కొత్త నేతను ప్రకటించే  అవకాశం ఉంది.