సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ అభివృద్దిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మాదిరిగానే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని కూడా ప్రభుత్వం అభివృద్ది చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఇందుకోసం తానే స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. వెయ్యి కోట్ల నిధులతో అమ్మవారి ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే కోరారు.
లష్కర్ బోనాల సందర్భంగా జగ్గారెడ్డి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేయించారు.మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం జగ్గారెడ్డి ఆలయ అభివృద్దిపై ధర్మకర్తతో చర్చించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాలనుండే కాదు వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి కూడా మహంకాళి అమ్మవారి దర్శనానికి వస్తుంటారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇక ఆషాడమాసంలో ఘనంగా జరిగే బోనాల వేడుకకోసం వేలాదిమంది తరలివస్తారని తెలిపారు. మిగతారోజుల్లో కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారని అన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు భక్తిశ్రద్దలతో కొలిచే మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ది చేయాలని జగ్గారెడ్డి కోరారు.
Read More వర్షాలు కురుస్తాయి, అగ్నిప్రమాదాలు జరుగుతాయి.. : భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని... అభివృద్ది కోసం నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ ను కోరనున్నట్లు ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.త్వరలోనే ఆలయ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ కు లేఖ రాయనున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు.
ఇదిలావుంటే నిన్న(ఆదివారం) లష్కర్ బోనాల సందర్భంగా మహంకాళి అమ్మవారిని చాలామంది ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం తొలిబోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాలనుండి బోనాలెత్తిన మహిళలు ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సతీసమేతంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కుటుంబసమేతంగా వచ్చి మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా బంగారు బోనమెత్తి అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సామాన్య ప్రజలు కూడా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
