సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఎటువంటి లోపం లేకుండా పూజలను సంతోషంగా, ఆనందంగా అందుకున్నానని చెప్పారు. గతేడాది ఇచ్చిన వాగ్దానం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అయితే స్పందించిన పూజారులు..‘‘మీరు బలం ఇస్తే మీరు అనుకున్న ప్రతిష్ట తప్పకుండా జరుగుతుంది’’ అని అన్నారు. దీనిపై అమ్మవారి వాక్కుగా స్వర్ణలత స్పందిస్తూ.. కావాల్సినంత బలాన్ని ఇచ్చానని, మీ వెంటే ఉంటానని భరోసా ఇచ్చారు. 

వర్షాలు తప్పనిసరిగా వస్తాయని.. కొన్ని ఒడిదుడుకులు అవుతాయని చెప్పారు. అగ్నిప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయని.. భయపడవద్దని అన్నారు. తన వద్దకు వచ్చిన ప్రజలను కాపాడుకుంటానని.. ఎలాంటి ఆపద లేకుండా కాపాడతానని అమ్మవారి వాక్కుగా చెప్పారు. ఐదు వారాలు తప్పనిసరిగా తనకు సాక సమర్పించాలని కోరారు. 

ఇక, గతేడాది మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తూ.. మొక్కుబడిగా కాకుండా.. సక్రమంగా పూజలు జరిపించాలన్నారు. సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నానని చెప్పారు. ఎన్ని రూపాల్లో తనను మారుస్తారని.. మీకు నచ్చినట్టుగా మారుస్తారా అని ప్రశ్నించారు. స్థిరమైన రూపంలో కొలువుదీరాలని అనుకుంటున్నానని అమ్మవారి వాక్కుగా చెప్పారు.