సారాంశం

ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్థానికులకే టిక్కెట్టు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.

హైదరాబాద్: నగరంలోని ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టిక్కెట్టు కోసం స్థానిక కాంగ్రెస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఈ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ నేత మధు యాష్కీ  ధరఖాస్తు చేసుకున్నారు. అయితే  మధు యాష్కీకి కాకుండా స్థానికంగా ఉన్న  నేతలకే  ఈ టిక్కెట్టును కేటాయించాలని స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు కోసం  స్క్రీనింగ్ కమిటీ నిన్న , ఇవాళ  న్యూఢిల్లీలో సమావేశమౌతుంది.ఈ సమావేశాల నేపథ్యంలో  ఎల్ బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను  కలుస్తున్నారు. మధు యాష్కీకి కాకుండా స్థానికంగా తమలో ఎవరికో ఒకరికి  ఈ టిక్కెట్టును కేటాయించాలని  కోరుతున్నారు.

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని  మధు యాష్కీ భావిస్తున్నారు. గతంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ అభ్యర్థిగా  మధుయాష్కీ పోటీ చేశారు. 2004, 2009 ఎన్నికల్లో నిజామాబాద్ నుండి మధు యాష్కీ కాంగ్రెస్ ఎంపీగా  విజయం సాధించారు.  2014, 2019 ఎన్నికల్లో ఇదే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి  పోటీ చేసి  మధు యాష్కీ ఓటమి పాలయ్యాడు.  గత ఎన్నికల సమయంలో అయిష్టంగానే నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి మధు యాష్కీ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 
గత ఎన్నికల్లోనే నిజామాబాద్ జిల్లా నుండి పోటీకి దూరంగా ఉండాలని మధు యాష్కీ ప్లాన్ చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో  మధు యాష్కీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ దఫా  ఎల్ బీ నగర్  అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు  మధు యాష్కీ పార్టీ నాయకత్వానికి ధరఖాస్తు చేసుకున్నారు.

మధు యాష్కీ ఎల్ బీ నగర్ అసెంబ్లీ టిక్కెట్టుకు ధరఖాస్తు చేసుకోవడంపై గాంధీ భవన్ లో పోస్టర్లు వెలిశాయి. పారాచ్యూట్ నేతలకు టిక్కెట్లు ఇవ్వకూడదని కోరారు.  అంతేకాదు మధు యాష్కీని  నిజామాబాద్ కు వెళ్లాలని సూచించారు.

also read:నాపై పోస్టర్ల వెనుక సుధీర్ రెడ్డి హస్తం: మధు యాష్కీ, కొట్టిపారేసిన దేవిరెడ్డి

ఎల్ బీ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మల్ రెడ్డి రాంరెడ్డి,  జక్కిడి ప్రభాకర్ రెడ్డి టిక్కెట్లను ఆశిస్తున్నారు.  వీరితో పాటు  జితేందర్ తదితరులు న్యూఢిల్లీకి వెళ్లారు.  ఎల్ బీ నగర్ అసెంబ్లీ టిక్కెట్టును  మధు యాష్కీకి కాకుండా తమలో ఎవరికో ఒక్కరికి కేటాయించాలని కోరారు.