తెలంగాణ అసెంబ్లీలో శాసనమండలి ఛైర్మన్ కంటికి అయిన గాయంపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తమ సభ్యత్వ రద్దుకు నిరసనగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ గాంధీభవన్ లో 48 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు దిగారు కోమటిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలివి.

తెలంగాణ లో ఒక నియంత పాలన సాగుతున్నది. కేసీఆర్ పచ్చి నియంత. మా దీక్ష నియంత పాలన ఎలా ఉందో దేశానికి తెలియజేయడానికే. నా ప్రాణం పోయినా సరే వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ ను ఓడించడమే నా లక్ష్యం. తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన వ్యక్తిని. మేము కేసీఆర్ లాగా దొంగ దీక్ష చేయం. మంత్రి హరీష్ కర్ణాటక ఎన్నికలతోపాటే నల్లగొండ, అలంపూర్ ఉప ఎన్నికలు వస్తాయి అంటన్నారట. ఉప ఎన్నికలు వస్తే సంపత్ ను 50 వేల ఓట్లతో గెలిపించుకుంటాం.

కేసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. టాస్క్ ఫోర్స్ పోలీస్ లను అసెంబ్లీ లో పెట్టారు. నాకు ,సంపత్ కు, రామ్మోహన్ రెడ్డి కి సభలో గాయాలు అయ్యాయి. కట్టు కథలతో స్వామి గౌడ్ కి గాయాలు అయినయి అని కేసిఆర్ అంటున్నారు. పొద్దున ఒక్క కన్నుకు సాయంత్రం ఇంకో కన్నకు స్వామి గౌడ్ ట్రీట్ మెంట్ చేపించుకుంటున్నారు. సభలో నిరసన తెలిపిన విజువల్స్ చూపిస్తున్నారు మరి స్వామి గౌడ్ కి గాయాలైనట్లు చూపే వీడియోలు ఎందుకు బయట పెట్టడంలేదు. ప్రజా సమస్యలు, రాజకీయ హత్యల పై నిలదీస్తామని మమ్మల్ని సస్పెండ్ చేశారు. నన్, సంపత్ ను బహిష్కరించారు. మీ బెదిరింపులకు భయపడం. రైతులు, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం.