డబుల్ బెడ్రూముల ఇండ్ల నిర్మాణంలో నిబంధనలు అతిక్రమిస్తే సహించేది లేదని వనపర్తి జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి హెచ్చరించారు. ఖిల్లాగణపురం ని శాపూర్‌ పంచాయతీ కర్ణెతండాలో డబుల్ బెడ్రూముల ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్‌ స్వయంగా పరిశీలించారు. అక్కడి తండాకు మంజూరైన ఇళ్ల వివరాలు, నిర్మిస్తున్న గదుల విస్తీర్ణం, ఇంటి ముందుభాగంలో రహదారి తదితర అంశాలను అధికారులతో ఆరా తీశారు. అలాగే నిబంధనల ప్రకారం మరుగుదొడ్డి ఉండాలని, అలా కాకుండా విరుద్ధంగా చేపడితే బిల్లును ఆపేస్తామని హెచ్చరించారు. నిర్మాణాలను వచ్చే మార్చి వరకు పూర్తయ్యేలా చూడాలన్నారు. పనులను నాణ్యంగా చేపట్టాలని కాంట్రాక్టర్ మురళీధర్‌రెడ్డికి సూచించారు. 

అల్లమాయపల్లి పంచాయతీలోని ఈర్లతండాలో పనులు ప్రారంభించామని, ఖిల్లాగణపురం, వూరంచుతండా, సోలీపూర్‌, గార్లబండతండా, కోతులకుంటతండా, సల్కెలాపురం తండాల్లో స్థలాల కొరత ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు లేనందున నిర్మాణాలకు ఇబ్బందికరంగా మారిందని పీఆర్‌ ఏఈ రమేశ్‌నాయుడు, ఎంపీపీ కృష్ణానాయక్‌ కలెక్టర్‌కు వివరించారు. 

పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌ ఆగ్రహం

ఖిల్లాగనపురం మండలంలోని శాపూర్‌ పంచాయతీ పరిధిలోని కర్ణెతండాను సందర్శించిన జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి ముందుగా అక్కడ నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అక్కణ్నుంచి తిరిగి వస్తుండగా.. శాపూర్‌లో మురుగుకాలువల్లో తీసిన చెత్తాచెదారాన్ని అక్కడే పక్కకు వేసి వదిలేయడాన్ని గుర్తించారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రవితేజను కలెక్టర్‌ నిలదీశారు. డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే దీనికి కారణమని, ఇలా మరోసారి జరగకుండా చూడాలని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టాలని కార్యదర్శిని ఆదేశించారు.