CM Revanth Reddy: హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల కలిగే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర మాస్టర్ ప్లాన్ ప్రకటించారు. మూసీ పునరుజ్జీవనం, డ్రైనేజీ ఆధునీకరణ, చెరువుల అనుసంధానం వంటి కీలక పనులు చేపట్టాలని ఆదేశించారు. 

CM Revanth Reddy: గత వారంలో రోజులుగా వర్షాలు బీభత్సం స్రుష్టిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌పై వరుణుడు ఉగ్రరూపం చూపాడు.గురువారం సాయంత్రం ఆకాశానికి చిల్లు పడిందా..! అన్నట్లు దాదాపు రెండు గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన జోరు వర్షానికి గ్రేటర్‌ హైదరాబాద్‌ అతలాకుతలమైంది. రోడ్లు వాగుల్లా మారాయి. మ్యాన్‌హోల్స్‌ పొంగిపొర్లాయి..అపార్ట్‌మెంట్ల సెల్లార్లు చెరువుల్లా తలాపించాయి. ఈ పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ఇక పై భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఇంతకీ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ?

హైదరాబాద్ వరద నియంత్రణ మాస్టర్ ప్లాన్

ప్రతి వర్షాకాలంలో ఎదురవుతున్న వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమగ్ర ప్రణాళిక రూపొందించారు. భారీ వర్షాల కారణంగా నగరంలో తలెత్తిన సమస్యలను సమీక్షిస్తూ ఆయన అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తక్షణ, దీర్ఘకాలిక చర్యలతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘హైదరాబాద్ వరద నియంత్రణ మాస్టర్ ప్లాన్’ను అమలు చేయాలని ఆదేశించారు.

భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా..

సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో నగరం అతలాకుతలం కాకుండా, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే అత్యవసరంగా శాశ్వతాభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. తాగునీరు, వరదనీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో వందేళ్ల భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

వర్షాలపై సమీక్ష

హైదరాబాద్ లో గురువారం రాత్రి 15 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదు కావడంతో ట్రాఫిక్ స్తంభించడంతో పాటు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని సమావేశంలో వివరించారు. సాధారణంగా మూడు-నాలుగు నెలల్లో కురిసే వర్షపాతం, ఒక్కరోజులో పడటం వాతావరణ మార్పుల ప్రభావమని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ 5 సెంటీమీటర్ల వర్షాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో ఉండటంతో, ఆధునీకరణ అవసరమని స్పష్టం చేశారు.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ప్రాధాన్యత

ఈ సమావేశంలో దాదాపు 55 కిలోమీటర్ల పొడవునా మూసీ పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. నగరంలోని అన్ని నాలాలు, చెరువులను మూసీకి అనుసంధానం చేయాలని ఆదేశించారు. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, మీర్ అలం చెరువు వంటి వాటి పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని కోరారు. నాలాల వెడల్పు పెంచడం, మురుగును తొలగించడం, మూసీలో ఎల్లప్పుడూ శుద్ధి చేసిన నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మూసీ పునరుజ్జీవనం లేకుండా నగరంలో వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు.

వరదనీటి నిర్వహణ ప్రణాళిక

ఔటర్ రింగ్ రోడ్డులోని కోర్ అర్బన్ రీజియన్ వరదనీటి సమస్యకు చెక్ పెట్టేలా, అన్ని వైపులా వరదనీరు మూసీకి చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు పడినా లోతట్టు ప్రాంతాలు ముంపు గురి కాకుండా పకడ్బందీ విధానాన్ని అమలు చేయాలన్నారు. వర్షాలు, వరదల సమయంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రతరం అవుతున్నందున ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. పాత నగరంలో పెడిస్ట్రియన్ జోన్ ఏర్పాటు, అలాగే, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆసుపత్రి వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.