భారతదేశానికి తలమానికంగా నిలిచే చారిత్రక ఘట్టం తెలంగాణలో ఆవిష్కృతమైంది. భాగ్యనగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర తీరాన దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అట్టహాసంగా జరిగింది. అయితే.. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

Ambedkar statue | దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 132వ జయంతి వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. కానీ.. ఈ ఏడాది తెలంగాణలో జరుగుతోన్న అంబేద్కర్‌ ఉత్సవాలు చాలా ప్రత్యేకం. నేడు భారతదేశానికి తలమానికంగా నిలిచే చారిత్రక ఘట్టం తెలంగాణలో ఆవిష్కృతమైంది. భాగ్యనగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర తీరాన దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల అంబేద్కరుడి విగ్రహా ప్రారంభోత్సవం జరిగింది. సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యఅతిథిగా వచ్చిన బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ లు మహా విగ్రహ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ విశ్వమానవుడని, అణగారిన వర్గాల పాలిట ఆశాదీపమని కేసీఆర్ ప్రకటించారు. 70 ఏళ్లు దాటినా రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు అమలు కావడం లేదన్నారు. ప్రతి యేటా అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటూ పోవడం కాదని.. ఆయన సూచించిన మార్గాన్ని అనుసరించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తాను ఎవరో చెబితే అంబేద్కర్ విగ్రహం పెట్టలేదని, ఈ జాతికి సందేశం ఇవ్వడానికే ఈ మహా విగ్రహాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు.

ఈ ప్రాంతంలో రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ వంటి సెక్రటేరియట్ వుందని, దానికి కూడా అంబేద్కర్ పేరే పెట్టామని కేసీఆర్ అన్నారు. దాని అవతల అమరవీరుల స్మారకం, దాని పక్కనే హుస్సేన్ సాగర్.. అందులో అంబేద్కర్‌ పూజించే బుద్ధుడి విగ్రహం వుందని వివరించారు. ప్రతి రోజు.. సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు అంబేద్కర్ విగ్రహాన్ని చూసి స్పూర్తిని పొందాలని కేసీఆర్ తెలిపారు.

ఇలా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో .. ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. అక్కడే స్టేజీ మీద ఉన్న మంత్రి హరీశ్ రావు.. ఓ చిట్టి రాసి సీఎం కేసీఆర్ కు అందించారు. ఆ చిట్టిలో ఇలా రాసి ఇచ్చారు. " ఇది విగ్ర‌హం కాదు.. ఒక విప్ల‌వం. ఇది ఆకారానికి ప్ర‌తీక కాదు.. ఇది తెలంగాణ క‌ల‌ల‌ను సాకారం చేసే దీపిక " అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చెప్పుతూ.. తనకు మంత్రి హరీశ్ ఓ చిట్టిలో రాసి ఇచ్చారని తెలిపారు. ఇలా సీఎం కేసీఆర్ నోట మంత్రి హరీశ్ రావు మాటలు వెలువడ్డాయి. 

అంతకు ముందు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. అంబేడ్కర్ మార్గదర్శనంతోనే దేశంలో అన్ని రంగాల్లో మనం ముందుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనుల కోసం ఎన్నో పథకాలను తీసుకవచ్చిందని తెలిపారు. ఈ జాతి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ (CM KCR).. దళితబంధు అనే సహోసోపెతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తవించారు.

ఇదే సమయంలో దేశంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ప్రారంభోత్సవం గురించి మాట్లాడుతూ.. సచివాలయంలో నుంచి చూస్తే ఒకవైపు అమరవీరుల స్థూపం, మరోవైపు అంబేడ్కర్ విగ్రహం కనిపిస్తుందని అన్నారు. అది అంబేడ్కర్ విగ్రహం కాదు విప్లవ రూపమని , అంబేడ్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని చెప్పుకోచ్చారు. ఇంకా దళితులకు సంక్షేమం కోసం చేయాల్సింది చాలా ఉందన్నారు. ఆర్థిక సమానత్వం వచ్చినప్పుడే అస్పృశ్యతను తొలగించవచ్చనీ, దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. నేడు దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.