ఎమ్మెల్యేల కొనుగోలును టీఆర్ఎస్ ప్రారంభించింది: సీఎల్పీ భట్టి
ఎమ్మెల్యేల కొనుగోలును టీఆర్ఎస్ ప్రారంభిస్తే బీజేపీ కొనసాగిస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
హైదరాబాద్:ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మొదలు పెట్టింది టీఆర్ఎస్ పార్టీయేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.మొయినాబాద్ లో జరిగిన ఘటనపై సీఎల్పీ నేత మల్లి భట్టి విక్రమార్క గురువారం నాడు స్పందించారు. మొయినాబాద్ ఫాం హౌస్ లో తమను ప్రలోభాలు పెట్టేందుకు కొందరు ప్రయత్నించారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ విషయాన్ని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యేల కొనుగోలును టీఆర్ఎస్ ప్రారంభిస్తే బీజేపీ కొనసాగిస్తుందని భట్టి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్ చేసిందనే విషయమై కూడ విచారణ జరిపించాలని సీఎల్పీ నేత డిమాండ్ చేశారు. తెలంగాణలో రాజకీయాలన్నీ అమ్మకం, కొనుగోలు చుట్టే తిరుగుతున్నాయని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించిందనే విషయమై పూర్తి వివరాలు బయటకి వచ్చిన తర్వాత స్పందిస్తానన్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన కన్పిస్తుందన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనం చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేత గుర్తు చేస్తున్నారు.2014లో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్‌ఎల్పీ లో విలీనం జరిగింది.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభం అంశానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అంశానికి సంబంధించి ఓ బీజేపీ ఎమ్మెల్యే ముందే ప్రకటించారని చెప్పారు.బీజేపీ ఎమ్మెల్యే మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలు సాగుతున్న వేళ మొయినాబాద్ పాంహౌస్ వేదికగా నలుుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలు పెట్టేందుకు జరిగినట్టుగా చెబుతున్న అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
also read:ఫాంహౌస్ నుండి నేరుగా ప్రగతి భవన్ కు: నిన్నటి నుండి నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్కడే
మునుగోడు ఉప ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే కేసీఆర్ సర్కార్ కుప్పకూలనుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రకటించారు. టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు ఇటీవల కాలంలో చేసిన ప్రకటనలను టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. మరోవైపు ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ప్రగతి భవన్ వేదికగా ఈ డ్రామా జరిగిందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు.