కరోనాతో తెలంగాణ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే.. జనాన్ని గాలికి వదిలేసి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఉన్న అప్పులు సరిపోవడం లేదని, మళ్లీ కొత్త అప్పుల కోసం ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం తీసుకున్నారని ఆయన మండిపడ్డారు.

గురువారం విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ... గడిచిన నాలుగైదు నెలల్లో మరో రూ.30 వేల కోట్ల అప్పులు చేశారని, ఇప్పుడున్న రూ.3 లక్షల కోట్ల అప్పులను ఐదారు లక్షల కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆయన ఆరోపించారు.

Also Read:తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులకు బ్రేక్: రేపటి వరకు స్టే పొడిగించిన హైకోర్టు

ప్రజలకు అవసరమైన విద్య, వైద్యాలను పక్కకుపెట్టి.. సచివాలయం కూల్చివేత, నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తున్నారు. మంత్రి కేటీఆర్‌కు ఇంగ్లీష్ మాట్లాడటం తప్పించి పరిపాలన మాత్రం రాదని భట్టి విమర్శించారు. ఇప్పటి వరకు చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని విక్రమార్క డిమాండ్ చేశారు.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త సచివాలయం పనుల నిర్మాణం ఆపేసి, తక్షణమే ఆసుపత్రిని అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఉత్తమ్ అక్కడ అందుతున్న సేవలపై రోగులను కలిసి మాట్లాడారు.

Also Read:కరోనా వేళ తెలంగాణ ఆరోగ్య శాఖలో కీలక అధికారుల బదిలీ, కారణం....

చిన్నపాటి వర్షానికే ఆసుపత్రిలోకి డ్రైనేజ్ నీరు ప్రవహించడం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఉత్తమ్ విమర్శించారు. కరోనాపై ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న డాక్టర్లకు 50 శాతం ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు.