పెళ్లి బారాత్ లో కారులో కూర్చుని డ్యాన్స్ చూస్తున్న చిన్నారి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట : ఆనందోత్సాహాలతో కళకళలాడుతున్న పెళ్లింట ఒక్కసారిగా విషాదం నిండిపోయింది. పెళ్లి బారాత్ లో నవ దంపతులతో కలిసి కారులో కూర్చున్న చిన్నారి డ్రైవర్ నిర్లక్ష్యంతో దుర్మరణం చెందింది. కారు వీండోలో తల ఇరుక్కుని చిన్నారి మృతిచెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం గ్రామంలో బంధువుల పెళ్లికి బానోతు వెంకటేశ్వర్లు భార్యాపిల్లలతో కలిసి హాజరయ్యాడు. గత ఆదివారం పెళ్లి జరగ్గా సాయంత్రం బారాత్ నిర్వహించారు. ఈ క్రమంలోనే నూతన వధూవరులతో కలిసి వెంకటేశ్వర్లు కూతురు ఇంద్రజ(9) కారులో కూర్చుంది. వెనకసీట్లో ఒంటరిగా వున్న చిన్నారి విండోలోంచి తల బయటకు పెట్టి డ్యాన్స్ చూస్తోంది. ఇది గమనించని కారు డ్రైవర్ విండో అద్దాలు పైకి ఎత్తడంతో అందులో ఇంద్రజ మెడ ఇరుక్కుంది. వెంటనే అద్దాలను కిందకు దించినా అప్పటికే ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 

Read More కుక్క దాడి నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ ఏజెంట్.. హైదరాబాద్ లో ఘటన

డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆనందాలు నిండిన పెళ్లింట ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నారి ఇంద్రజ తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో కారు డ్రైవర్ శేఖర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెళ్లికి తీసుకెళ్ళిన కూతురు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.