తెలంగాణలో భారీ వర్షాలు: ముందస్తు ఏర్పాట్లపై ప్రభుత్వ చర్యలు.. సీఎస్ సమీక్ష
Hyderabad: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రెండో రోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధానిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, కలెక్టరేట్, మండలాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చారు.
Telangana rains: హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రెండో రోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర రాజధానిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, కలెక్టరేట్, మండలాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చారు.
వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఐఎండీ జారీ చేసిన రెడ్, ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంతో పాటు ప్రాణనష్టం జరగకుండా చూడటంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలించాలనీ, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
కలెక్టరేట్, మండలాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ, పోలీసు, ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్అండ్ బీ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ చెరువుల్లో పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. రోడ్లు, కాజ్‌వేలు కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, ముంపునకు గురయ్యే చెరువులకు పగుళ్లు ఏర్పడితే ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, ప్రమాదకర కాజ్‌వేలు, వంతెనలను ఇప్పటికే గుర్తించినట్లు విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. అగ్నిమాపక శాఖ ఇప్పటికే అన్ని జిల్లా కార్యాలయాల్లో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేసిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఆ శాఖ కూడా అప్రమత్తమై అత్యవసర పరిస్థితుల్లో జిల్లాలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు.