చీమలపాడు దుర్ఘటన: కుట్ర కోణంపై పోలీసుల విచారణ.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Khammam: ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కారేపల్లి మండలంలోని చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2లక్షలతో పాటు ఉచితంగా వైద్యం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
BRS working president KTR: ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరికి గాయాలు కావడం వెనుక కుట్ర ఏమైనా ఉందా అనేది పోలీసుల విచారణలో తేలుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం అన్నారు. హైదరాబాద్ లోని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ )ను సందర్శించిన కేటీఆర్.. బీఆర్ఎస్ నేతలతో కలిసి క్షతగాత్రులను పరామర్శించారు.
గాయపడినవారి ఆరోగ్య పరిస్థితిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని బీఆర్ ఎస్ నేత ఆసుపత్రి అధికారులను కోరారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. ఈ ఘటన వెనుక ఏమైనా కుట్ర ఉందా లేదా అనేది పోలీసుల విచారణలో తెలుస్తుందన్నారు.
కాగా, ఖమ్మం జిల్లా వైరా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కారేపల్లి మండలంలోని చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ. 2లక్షలతో పాటు ఉచితంగా వైద్యం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
సభాస్థలి సమీపంలోని గుడిసెపై బాణసంచా పేలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్టీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే రాములు నాయక్ లకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చారని సమాచారం. అగ్నిప్రమాదం, సిలిండర్ పేలుడుకు బీఆర్ఎస్ సమావేశానికి సంబంధం లేదని నాగేశ్వర్ రావు చెప్పినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.