Asianet News TeluguAsianet News Telugu

చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా.. రాజాసింగ్ అరెస్ట్ తో నిర్ణయం..

రాజాసింగ్ అరెస్ట్, పాతబస్తీలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవ్వాళ జరగాల్సిన చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. 

Chandrayanagutta Fly Over Opening Postponed in hyderabad
Author
Hyderabad, First Published Aug 23, 2022, 1:36 PM IST

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చాంద్రాయణ గుట్ట ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది.  దీనిని మంత్రి కేటీఆర్ ప్రారంభించాల్సి ఉండగా రాజా సింగ్ వ్యాఖ్యలు,  ఆయన అరెస్టుతో పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. రాజాసింగ్ కామెంట్స్ పై ఎంఐఎం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడం.. పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. దీంతో అధికారులు ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రజల మౌలిక అవసరాలు పూర్తి చేయడంలో బల్దియా వేగంగా అడుగులు వేస్తోంది. 

నగరంలో నలువైపులా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో చేపట్టిన 41 పనుల్లో దాదాపు 30 పూర్తయ్యాయి. నగరంలో ఇప్పటివరకు మొత్తం 15 ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. సిటీలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఫ్లైఓవర్లు, అండర్ పాసులు,  ఆర్ ఓబీలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ ను రూ. 45.79 కోట్ల వ్యయంతో నిర్మించారు. మొత్తం నాలుగు లైన్లను రెండు వైపులా 674 మీటర్ల పొడవుతో నిర్మాణం పూర్తి చేశారు.  

ధర్మం కోసం చావడానికైనా సిద్దమే: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

కందికల్ గేట్, భార్కస్ జంక్షన్ వద్ద  ట్రాఫిక్ ఉచ్చులో పడిపోకుండా నేరుగా ఫ్లైఓవర్ పై నుంచి వెళ్ళిపోవచ్చు. తద్వారా ప్రమాదాలు జరగకుండా ఉండడంతో పాటు ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు.ఈ ఫ్లైఓవర్ విస్తరణతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎల్బీనగర్ మీదుగా నల్లగొండ, వరంగల్ వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. నాగోల్ వద్ద చేపట్టిన పనులు ప్లైఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆరాంఘర్ నుండి ఉప్పల్ జంక్షన్ వరకు  రవాణా మెరుగుపరచడమే కాకుండా సిగ్నల్ ఫ్రీ రవాణా మెరుగవుతుంది. కాగా, వాయిదా పడిన చాంద్రాయణగుట్ట పై వంతెన ప్రారంభోత్సవం ఈ నెల 27న జరిగే అవకాశం ఉంది. 

ఇదిలా ఉండగా, మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాజాసింగ్ సోమవారం మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని రాత్రి నుంచి హైదరాబాద్ లో నిరసనలు చెలరేగాయి. మునావర్ ఫరూఖీ కామేడీ షోకి సంబంధించి రాజాసింగ్ విడుదల చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రాజాసింగ్ మీద కేసు నమోదు చేశారు.  ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం రాజాసింగ్‌ను ఆయన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios