హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు  తాను ఎప్పుడూ కూడ అడ్డుపడలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 

బుధవారం నాడు హైద్రాబాద్‌లో ప్రజా కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు.  తెలంగాణలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు మినహా ఇతర ప్రాజెక్టులన్నీ తాను సీఎంగా ఉన్న సమయంలో ప్రారంభించినవేనని చెప్పారు.

ఆ ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ కొనసాగించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటి మాత్రమే కేసీఆర్ ప్రారంభించారని  చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.
తాను  ప్రాజెక్టులను అడ్డుపడుతున్నానని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను చర్చించుకొందామని తాను కేసీఆర్ చెప్పిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.

గోదావరి నుండి 2500 టీఎంసీల నీరు వృధాగా  సముద్రంలోకి పోయిందన్నారు. ఈ నీటిని సరిగా ఉపయోగించుకొంటే రెండు రాష్ట్రాలకు ప్రయోజనంగా ఉండేదన్నారు. 

హైద్రాబాద్‌ను ఓ విజన్‌తో తాను అభివృద్ధి చేసినట్టు బాబు గుర్తు చేశారు.నరేంద్రమోడీ తరహలో హిందూ,ముస్లింలు మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని... అదే తరహలో కేసీఆర్ కూడ ప్రాజెక్టులకు తాను అడ్డుపడుతున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు చెప్పారు.

తెలంగాణ అభివృద్ధి చేసేందుకు ప్రజా కూటమిని ఏర్పాటు చేసినట్టు చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.తెలంగాణలో కేసీఆర్ సర్కార్  నియంత పాలన గుర్తు చేస్తోంందన్నారు. హైద్రాబాద్ ను, తెలంగాణ, ఏపీలు అభివృద్ధి కావాలన్నారు.తెలంగాణ పాలనలో  తాను జోక్యం చేసుకొంటానని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు చెప్పారు. తనకు అలాంటి ఉద్దేశ్యం లేదన్నారు.

సంబంధిత వార్తలు

ఫలితాల తర్వాతే సీఎంను డిసైడ్ చేస్తాం: రాహుల్

దేశ రాజకీయాల్లో మార్పు తెలంగాణతోనే ఆరంభం: ప్రజా కూటమి