వరంగల్‌ ప్రజల ఏళ్లనాటి కల సాకారమవుతోంది. సుమారు 32 ఏళ్ల తర్వాత వరంగల్‌ జిల్లా మామునూరు ఎయిర్​పోర్ట్​ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు వరంగల్‌ ఎయిర్‌ పోర్ట్‌ చరిత్ర ఏంటి.? ఈ ఎయిర్‌ పోర్ట్‌ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రానుందో తెలుసుకుందాం..  

తెలంగాణలో ఎట్టకేలకు రెండో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. వైమానిక అవసరాల కోసం రాష్ట్రంలో పలు విమానాశ్రయాలు ఉన్నా ప్రయాణికుల అవసరం కోసం ఉంది మాత్రం ఒక్క శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మాత్రమే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వరంగల్‌లో ఎయిర్‌ పోర్ట్‌ అభివృద్ధికి ముందడుగు పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు మామూనూరు ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్‌కి కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్: 

Scroll to load tweet…

ఆలస్యానికి కారణం ఏంటి.? 

నిజానికి ఈ విమానాశ్రయ అభివృద్దికి సంబందించి ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి 150 కి.మీల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్‌ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ కారణంగానే వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ ముందుకు సాగలేదు. అయితే తాజాగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయమై జీఎంఆర్‌ సంస్థతో ప్రత్యేకంగా చర్చించారు. దీంతో మామునూరు ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధికి జీఎంఆర్‌ అంగీకారం తెలిపింది. దీంతో ఎయిర్‌ పోర్ట్‌ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీని కేంద్రమంత్రి ఆదేశించారు. ఎయిర్‌ పోర్ట్‌ అభివృద్ధికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని సేకరించే పనిని కూడా తెలంగాణ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. 

ధన్యవాదాలు తెలిపిన సీఎం: 

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్టు కల సాకారమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 

Scroll to load tweet…

ఎన్నో ఏళ్ల చరిత్ర: 

మూమునూరు ఎయిర్‌ పోర్ట్‌కి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. చివరి నిజాం సుమారు 706 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్‌ స్ట్రిప్‌ నిర్మించారు. భారత్‌-చైనాల మధ్య జరిగిన యుద్ద సమయంలో ఈ విమానాశ్రయాన్ని ఉపయోగించారు. 1930లో సౌత్‌ ఏషియాలో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్‌గా మామునూర్‌ ఎయిర్‌ పోర్టుకు పేరుంది. 1981 వరకు విమానాల రాకపోకలు జరిగాయి. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. సొలాపూర్, కాగజ్ నగర్‍ వంటి ఏరియాల్లో వ్యాపారాలు చేసేందుకు ఇక్కడి నుంచే ప్రయాణాలు సాగించేవారు. కాగా అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చే రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు ఇక్కడే ఫ్లైట్ దిగేవారు. 1970 నుంచి 1977 మధ్యలో ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు వాయుదూత్‍ విమాన సర్వీసులు కూడా నడిపారు. దాదాపు 32 ఏళ్ల క్రితం ఈ ఎయిర్‌పోర్ట్‌ మూతపడింది. అయితే అప్పుడప్పుడు కొన్ని శిక్షణ విమానాల కోసం దీనిని ఉపయోగించుకుంటున్నారు.