విషాదం: అరుంధతి నక్షత్రం చూస్తూ మృతి చెందిన నవవధువు

Bujji dies after minutes of marriage in Achampeta
Highlights

పెళ్లైన కొన్ని క్షణాలకే నవ వధువు బుజ్జి మృతి చెందిన విషాదకరఘటన శనివారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకొంది. పెళ్లి జరిగిన తర్వాత అరుంధతి నక్షత్రం చూస్తూ నవ వధువు కుప్పకూలింది.

అచ్చంపేట:నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పెళ్లైన కొన్ని క్షణాల్లోనే నవ వధువు మృతి చెందింది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పెళ్లైన కొన్ని క్షణాల్లోనే నవ వధువు బుజ్జి మృతి చెందడంతో  కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుకు  అచ్చంపేటకు చెందిన బుజ్జికి రెండు కుటుంబాల పెద్దలు వివాహం నిశ్చయించారు. శనివారం నాడు అచ్చంపేటలో వివాహం జరిగింది. వివాహం సందర్భంగా రెండు కుటుంబాలకు చెందిన బంధువులు, వధూవరుల స్నేహితులు పెళ్లి పందింట్లో సందడి చేశారు. 

తాళికట్టిన కొద్దిసేపటికే  సంప్రదాయం ప్రకారంగా అరుంధతి నక్షత్రం చూస్తున్న సమయంలో నవ వధువు బుజ్జి కుప్పకూలింది. అరుంధతి నక్షత్రం చూస్తుండగానే  భర్త కాళ్లమీద కుప్పకూలిపోయింది.

నీరసంగా ఉన్న కారణంగా కిందపడిపోయిందని అంతా భావించారు. ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ, వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందిందని తేల్చి చెప్పారు. 

అసలు  బుజ్జి మరణానికి గుండెపోటు కారణమని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే  పోస్ట్‌మార్టం తర్వాత   బుజ్జి మృతికి అసలు కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు.

కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న సమయంలో నవ వధువు బుజ్జి మృతి చెందడం  పలువురిని కంటతడిపెట్టించింది.  మృతురాలి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు బుజ్జికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడ లేవని  కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఆమె మరణానికి గల కారణాలు పోస్ట్ మార్టం నివేదికలో తెలిసే అవకాశాలున్నాయి. 

loader