తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ వ్యూహం ఇదే.. మాయావతి కీలక నిర్ణయాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అనుసరించే వ్యూహాన్ని చీఫ్ మాయావతి వెల్లడించారు. తెలంగాణ అసెంబ్లీ బరిలో బీఎస్పీ ఒంటరిగానే దిగుతుందని తెలిపారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలోనూ బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు.

హైదరాబాద్: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సహా త్వరలో జరగనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అనుసరించాల్సిన వ్యూహాన్ని ప్రకటించారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా పొత్తులకు సంబంధించీ ఈ వారంలోనే కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే. అధికార ఎన్డీయేలోని 38 పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ రెండు పక్షాలు కాకుండా ఒంటరిగా ఉన్న పార్టీల సంఖ్య అత్యల్పం. తెలుగు రాష్ట్రాల పార్టీలు కూడా పై రెండు పక్షాల్లో దేనిలోనూ చేరలేదు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈ పక్షాల కూటమి ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు.
బీఎస్పీ కూడా పై రెండు పక్షాల కూమిలో దేనిలోనూ చేరలేదు. ఎన్డీయే, ఇండియా కూటములు ఖరారైన తరుణంలో బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక నిర్ణయాలు అనివార్యంగా తీసుకున్నారు. బీఎస్పీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని, ఒంటరిగా పోటీ చేస్తుందని వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తూ రెండు పక్షాల కూటములనూ ఆమె విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కులతత్వ, పెట్టుబడిదారీ పార్టీలతో దోస్తీ కట్టిందని అన్నారు. బీజేపీ ఎన్డీయేను బలోపేతం చేస్తున్నదని, కానీ, అది ముస్లిం, దళితులకు వ్యతిరేకమైన విధానాలు కలిగినదని ఆరోపించారు. పేద ప్రజల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని బీజేపీ 2014లో హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కూడా అదే బాపతు అని విమర్శించారు.
తెలంగాణలో బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో దూకుడు పెంచుకుంది. అయితే, ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన సత్తా నిరూపించాల్సి ఉన్నది.