టెన్త్ క్లాస్ పేపర్ లీక్  అంశంలో  బీజేపీ  నేతల హస్తం ఉందని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు.   బండి సంజయ్ పై పీడీ యాక్ట్  పెట్టాలని  ఆయన డిమాండ్  చేశారు.  


హైదరాబాద్:బండి సంజయ్ ఆదేశాలతోనే టెన్త్ క్లాస్ పేపర్ లీక్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. బుధవారంనాడు హైద్రాబాద్ బీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమైతే బండి సంజయ్ పై పీడీ యాక్ట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టెన్త్ పేపర్ లీక్ పేరుతో ప్రభుత్వంపై బురదచల్లే కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

 రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల విషయంలో పోటీ పడడంలో బీజేపీ నేతలు వెనుకబడ్డారని ఆయన చెప్పారు. తమతో పోటీపడలేక బీజేపీ నేతలు ఈ రకంగా వ్యవహరిస్తున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీలో రాజశేఖర్ రెడ్డితో బండి సంజయ్ పేపర్ లీక్ చేయించారని ఆయన ఆరోపించారు. పేపర్ లీక్ విషయంలో కీలకంగా వ్యవహరించిన వారిని కఠినంగా శిక్షించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. 9 ఏళ్లలో రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగలేదని ఆయన గుర్తు చేశారు. 

 రాజకీయంగా తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఈడీ, సీబీఐ లతో ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. పేపర్ లీకేజీలో బీజేపీ నేతల ప్రమేయం ఉందన్నారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో నిందితుడు రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. రాజశేఖర్ రెడ్డి బీజేపీ సోషల్ మీడియా విభాగంలో కీలకపాత్ర పోషిస్తున్నాడని ఆయన ఆరోపించారు. మరో వైపు టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అంటూ వైరల్ చేసిన ప్రశాంత్ కూడా బీజేపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని ఆయన చెప్పారు. 

also read:డీజీపీ నుండే సరైన సమాధానం లేదు: బండి సంజయ్ అరెస్ట్ ను తప్పుబట్టిన కిషన్ రెడ్డి
మోడీ, అమిత్ షా, తురుణ్ చుగ్ ల కనుసన్నల్లోనే పేపర్ లీక్ లు జరిగాయని బాల్క సుమన్ ఆరొపించారు. పేపర్ లీకులకు పాల్పడిన బీజేపీ నేతలను గ్రామాలకు వస్తే తరిమికొట్టాలని బాల్క సుమన్ ప్రజలను కోరారు.