డీజీపీ నుండే సరైన సమాధానం లేదు: బండి సంజయ్ అరెస్ట్ ను తప్పుబట్టిన కిషన్ రెడ్డి
బండి సంజయ్ అరెస్ట్ విషయంలో పోలీసుల వద్దే సరైన సమాచారం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తప్పుడు కేసులతో తమ నేతలను గతంలో కూడా అరెస్ట్ చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
హైదరాబాద్: బండి సంజయ్ అరెస్ట్ విషయమై తెలంగాణ డీజీపీ కారణం చెప్పలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై బుధవారంనాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైద్రాబాద్ లో ఓ తెలుగు న్యూస్ చానెల్ తో మాట్లాడారు. బండి సంజయ్ అరెస్ట్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ అరెస్ట్ విషయమై తెలంగాణ డీజీపీతో ఫోన్ లో మాట్లాడినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు. అయితే కేసుకు సంబంధించిన ఫైలు తయారౌతుందని చెప్పారన్నారు. ఈ కేసు ఫైలు పూర్తైన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీజీపీ తనకు తెలిపారని కిషన్ రెడ్డి వివరించారు. సరైన కారణం చెప్పకుండానే బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
పలువురు మీడియాప్రతినిధులకు పంపినట్టుగా ఆ వ్యక్తి బండి సంజయ్ కు కూడా హిందీ పేపర్ ను పంపారని కిషన్ రెడ్డి చెప్పారు. బండి సంజయ్ కు ఆ వ్యక్తి హిందీ పేపర్ వాట్సాప్ లో ఎందుకు షేర్ చేశాడో తమకు తెలియదన్నారు. వాట్సాప్ లో ఓ వ్యక్తి పేపర్ ను షేర్ చేస్తే బండి సంజయ్ ను అరెస్ట్ చేస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ ను అస్థిరపర్చాల్సిన అవసరం తమకు లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. నాలుగైదు మాసాల్లో వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు బుద్ది చెబుతారని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
also read:గందరగోళపర్చే కుట్ర,రెండు గంటల్లో ప్రశాంత్ 144 ఫోన్ కాల్స్: సబితా ఇంద్రారెడ్డి
ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతామన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఫాం హౌస్ కు పంపుతామన్నారు. బీఆర్ఎస్ కు పోలీసులు కీలు బొమ్మలుగా మారారని ఆయన ఆరోపించారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. తప్పుడు ఆరోపణలతో గతంలో కూడా బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.టెన్త్ క్లాస్ పేపర్ లీక్ పై ఆందోళనలు చేస్తుంటే తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తుందని కిషన్ రెడ్డి విమర్శించారు.బండి సంజయ్ అరెస్ట్ కారణంగా ఈ నెల 8వ తేదీన హైద్రాబాద్ లో జరిగే ప్రధాని మోడీ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బంది జరగదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను నిన్న రాత్రి కరీంనగర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ విషయమై పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ పేపర్ లీక్ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి నుండి బండి సంజయ్ కు వాట్సాప్ లో షేర్ అయిందని పోలీసులు చెప్పారు.ఈ విషయమై పోలీసులు కరీంనగర్ నుండి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బండి సంజయ్ అరెస్ట్ విషయం తెలుసుకున్న ఆ పార్టీ శ్రేణులు ఇవాళ ఉదయం బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు ప్రయత్నించారు.