బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్. రమణ తండ్రి ఎల్.గంగారం(80) కన్నుమూసారు.
జగిత్యాల : అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎల్. రమణ ఇంట విషాదం నెలకొంది. వృద్దాప్యంతో పాటు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎల్.రమణ తండ్రి ఎల్.గంగారాం(80) సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. జగిత్యాలలోని స్వగృహంలోనే ఎమ్మెల్సీ తండ్రి గంగారాం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పితృవియోగంతో ఎమ్మెల్సీ రమణతో పాటు ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
జగిత్యాల పట్టణంలో ఎల్.గంగారాం మంచి వ్యాపారవేత్తగా గుర్తింపుపొందారు. ఇక కొడుకు ఎల్. రమణ రాజకీయాల్లో వచ్చినతర్వాత ఎల్.గంగారాం ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కొడుకు రాజకీయ ఎదుగుదలను చూసి ఎంతో ఆనందించేవారు.
అయితే వృద్దాప్యంతో అనారోగ్యం బారిన పడటంతో కొంతకాలంగా ఎల్.గంగారాం ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మృతిచెందారు. దీంతో ఎమ్మెల్సీ రమణతో పాటు కుటుంబసభ్యులు బాధలో మునిగిపోయారు.
Read More కరీంనగర్ లో ఘోర రోడ్డుప్రమాదం... ఇసుక ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు స్నేహితుల దుర్మరణం
ఎమ్మెల్సీ ఎల్. రమణ తండ్రి ఎల్.జి. రామ్ మృతిచెందినట్లు తెలిసి పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు నివాళులు అర్పిస్తున్నారు. బాధలో వున్న రమణ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎల్.రమణ తండ్రి గంగారాం మృతికి సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అన్నారు.
