రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టడంతో బైక్ పై వెళుతున్న ముగ్గురు స్నేహితులు మృత్యువాతపడ్డారు. ఈ దారుణం కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్ : ఇసుక ట్రాక్టర్ ఢీకొని మగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ముగ్గురు స్నేహితులు బైక్ పై వెళుతుంటే రాంగ్ రూట్ లో వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామానికి చెందిన శివరాత్రి అంజి(26),శివరాత్రి సంపత్ (18), గుడిపెల్లి అరవింద్ (22) మంచి స్నేహితులు. ఈ ముగ్గురూ కలిసి బైక్ పై బయటకు వెళ్లగా ఇసుక ట్రాక్టర్ రూపంలో మృత్యువు వెంటాడింది. వీరి దారిలో వీరు సరదాగా మాట్లాడుకుంటూ వెళుతుండగా రాంగ్ రూట్ లో వచ్చిన ఓ ఇసుక ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టింది. తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ట్రాక్టర్ ఢీకొట్టగానే ముగ్గురు స్నేహితులు కిందపడిపోయారు. అంతటితో ఆగకుండా ఇసుక లోడ్ ట్రాక్టర్ అదుపుతప్పిన వారి పైనుండి దూసుకెళ్లింది. దీంతో అంజి, సంపత్, అరవింద్ అక్కడిక్కడే మృతిచెందారు.
Read More బండ్లగూడ సన్ సిటీ దగ్గర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి...
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ ను సీజ్ చేసి పరారీలో వున్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో తమ బిడ్డలు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకేరోజు ముగ్గురు యువకుల మృతితో రామంచ గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
