హైదరాబాద్‌లో చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ర్యాలీ.. పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ శ్రేణులు, మద్దతుదారులు నిరసనలు చేపడుతున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయగా.. విజయవాడలోని ఏసీబీ కోర్టు సెప్టెంబరు 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు, మద్దతుదారులు నిరసనలు చేపడుతున్నారు. ఏపీలోనే కాకుండా.. హైదరాబాద్, బెంగళూరుతో పాటు విదేశాల్లో సైతం పలువురు చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ప్రదర్శన జరిగింది. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో వందలాది మంది మద్దతుదారులు పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తున్నట్టుగా ఫ్లకార్డులు ప్రదర్శించడమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే ఈ నిరసనల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఈ ర్యాలీకి హాజరై టీడీపీ మద్దతుదారులకు సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీలో బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే వనస్థలిపురం ప్రాంతంలో ఏపీ సెటిలర్స్ ఎక్కువ సంఖ్యలో నివాసం ఉన్న సంగతి తెలిసిందే.
అయితే అనుమతి లేదనే కారణంతో ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొందరు ఆందోళనకారులను కూడా అదుపులోకి తీసుకున్నారు.