ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కూతురు సంచలన ఆరోపణలు, భూ ఆక్రమణ, ఫోర్జరీలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...
‘మా నాన్న నా భూమి ఆక్రమించాడు, నా సంతకం ఫోర్జరీ చేశాడు..’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తారెడ్డి యాదగిరిరెడ్డి మీద సొంత కూతురు పీఎస్ లో ఫిర్యాదు చేసింది.
జనగామ : టిఆర్ఎస్ జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మరోసారి వివాదాస్పదంగా మారాడు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా పేరుగాంచిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ముత్తిరెడ్డి మీద ఆయన సొంత కుమార్తె తిరగబడింది. తన భూమిని ఆక్రమించాడు అంటూ కేసు పెట్టింది. దీంతో ఈ వివాదం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది. తండ్రీ కూతుళ్ళు.. వాదనలతో ఆగకుండా పంచాయతీని పోలీస్ స్టేషన్ దాకా తీసుకు వెళ్లడంతో ఇది రచ్చ రచ్చగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..
ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవాని రెడ్డి.. సిద్దిపేట జిల్లా చేర్యాలలో తనకు సంబంధించిన ఎకరం 20 గుంటల భూమిని.. తన తండ్రి ఆక్రమించాడని ఆరోపిస్తోంది. తండ్రి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని తీసుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు ముత్తిరెడ్డిపై ఇదే విషయాన్ని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు కూడా చేసింది. ఈ ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారు. దీనిమీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
జగిత్యాలలో విషాదం : పదేళ్ల తరువాత వచ్చిన తండ్రి.. అంతలోనే కుమారుడి మృతి..
అయితే ఈ భూమి గురించిన వివాదం ఇది కొత్తకాదు. గతంలోనూ దీని మీద తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెరువు భూమిని కబ్జా చేశాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టాయి. కాగా, ఇప్పుడు అదే భూమి గురించి కూతురు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చినట్టయింది. అయితే తుల్జా భవాని రెడ్డి ఫిర్యాదు చేసినప్పటికీ ఉప్పల్ పోలీసులు దీనిమీద ఇప్పటివరకు ఏమాత్రం స్పందించలేదు.
తండ్రి మీద స్వయంగా కూతురే ఫిర్యాదు చేయడం వెనక కుటుంబ కక్షలు ఏమన్నా ఉన్నాయా? రాజకీయపరంగా భేదాభిప్రాయాలు ఏమైనా వచ్చాయా? అనేది తేలాల్సి ఉంది. అయితే, ముత్తిరెడ్డిపై గతంలోనూ భూములు ఆక్రమించారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వైయస్సార్ టిడిపి అధినేత్రి వైయస్ షర్మిల ముత్తిరెడ్డికి ‘కబ్జారెడ్డి’ అని కూడా పేరు పెట్టారు.
ఆ మధ్య కాలంలో 6 ఎకరాల ఓ వివాదాస్పద స్థలంలో ముత్తిరెడ్డి మున్సిపల్ నాలాకు అడ్డంగా వెంచర్ వేసినట్టుగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ వెంచర్ను మాజీ సర్పంచ్ అడ్డుకున్నాడు. దీంతో ముత్తిరెడ్డి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మత్తడి సమీపంలోనూ అర ఎకరం స్థలాన్ని ఆక్రమించాడని స్థానికంగా ఉన్న విపక్ష నేతలు ఆరోపణలు గుర్తించారు.
దీనికి తోడు మత్తడి నుంచే నిర్మించే కాలువ విషయంలో కూడా డిజైన్ మార్చారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి తాను గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపించినా రాజీనామా చేస్తానని అప్పట్లో సవాల్ కూడా చేశారు. ప్రస్తుతం సొంతింటిలోనే అసమ్మతి చెలరేగడం.. ఫిర్యాదులు రావడంతో పాత విషయాలన్నీ వెలుగు చూస్తున్నాయి.