జగిత్యాలలో విషాదం : పదేళ్ల తరువాత వచ్చిన తండ్రి.. అంతలోనే కుమారుడి మృతి..

జగిత్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ పన్నెండేళ్ల చిన్నారి బండి నడుపుతూ వెళ్లి.. యాక్సిడెంట్ లో మరణించాడు. కొద్ది గంటల క్రితమే అతని తండ్రి పదేళ్ల తరువాత సౌదీ నుంచి తిరగివచ్చాడు. 

minor boy killed over bike accident in jagtial - bsb

జగిత్యాల : పదేళ్ల తర్వాత తండ్రి తిరిగి వచ్చిన సంబరం అంతలోనే ఆవిరైంది. నీళ్లు తీసుకు వస్తానని ద్విచక్ర వాహనం మీద వెళ్లిన కొడుకు విగత జీవిగా తిరిగి వచ్చాడు. దీంతో ఆ కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన అందర్నీ కలచివేస్తుంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి  ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళాడు. తన కుమారుడికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడు వెళ్లిన వ్యక్తి.. పదేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు.. భార్యా పిల్లల్ని  వదిలేసి.. దేశం కాని దేశంలో ఉండడం.. అప్పుడప్పుడు  పిల్లలతో ఫోన్లో మాట్లాడడమే అతనికి ఉపశమనంగా ఉండేది.

పిల్లల అచ్చటా, ముచ్చటా  చూడలేకపోతున్నానే అనే బాధ అతడిని వేధించేది. చివరికి సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు  భార్యా పిల్లల్నికలుసుకోవడానికి స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఎయిర్పోర్టుకు కుటుంబ సభ్యులు వచ్చారు.  వారిని చూసి ఎంతో సంబరపడ్డాడు. పిల్లల్ని చూసి మురిసిపోయాడు.  ఎంతపెద్దగా అయిపోయారంటూ అప్యాయంగా దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. అందరూ కలిసి జగిత్యాలలోని ఇంటికి చేరుకున్నారు. 

బాలుడిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం.. చిన్నారి మృతి...

ఈ సంతోషం  కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదంగా మారింది.  వీరి కుమారుడు శివకార్తిక్ (12)..  ఇంట్లోకి తాగడానికి నీటి డబ్బా తీసుకొస్తానని  ద్విచక్ర వాహనం వేసుకుని వెళ్ళాడు. కాసేపటికి అతడు చనిపోయాడు అన్న వార్త కుటుంబానికి చేరింది. బోరురుమంటూ విలపించడం తప్ప వారు ఏమి చేయలేకపోయారు.  జగిత్యాలలో జరిగిన ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 

జగిత్యాల పట్టణంలోని మహాలక్ష్మి నగర్ కు చెందిన పద్మిని,  చౌటుపల్లి మోహన్ దంపతులు. వీరికి హర్ష అనే కుమారుడు,  శివ కార్తీక్ అనే  కుమారుడు ఉన్నారు.  శివకార్తిక్ స్థానికంగా ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మోహన్ పదేళ్ల క్రితమే జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్ళాడు. పదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన తండ్రిని కుటుంబ సభ్యులంతా కలిసి ఏర్పాటు నుంచి తీసుకువచ్చారు. ఆ తర్వాత ఇంట్లో తాగునీరు అయిపోవడంతో శివ కార్తీక్ తాను తీసుకొస్తానని బయటకు వెళ్ళాడు. 

టూ వీలర్ మీద బైపాస్ రోడ్డులో వెళుతుండగా దేవిశ్రీ గార్డెన్స్ సమీపంలో బండి అదుపు తప్పింది. డివైడర్ను ఢీ కొట్టింది. దీంతో శివ కార్తీక్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన వారు ఆస్పత్రికి తరలిస్తుండగా శివ కార్తీక్ మార్గమధ్యంలోనే చనిపోయాడు. ఆ చిన్నారి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మైనర్ లకి వాహనం ఇవ్వడం మీద అప్రమత్తంగా ఉండాలని.. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios