ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. విభజన హామీలపై ప్రధాని కనీసం మాట్లాడలేదని.. చివరికి మా నినాదాన్ని కూడా కాపీ కొట్టారని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలకు చెందిన కుటుంబ సభ్యులే ఎంపీలుగా వున్నారని దుయ్యబట్టారు. నవోదయ విద్యాలయాలు కావాలని తాము అడిగితే ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. యూనివర్సిటీలలో ఉద్యోగ నియామకాలు జరగాలని చట్టం చేస్తే ఇంతవరకు ఆమోదం తెలపలేదని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదని.. ఎన్నికల సమయంలో ఏదో ఒక ప్రకటన చేస్తారని ఆశపడ్డ తెలంగాణ ప్రజలకు నిరాశే ఎదురైందన్నారు.
తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ప్రకటన చేయలేదని.. ఇక్కడ గెలిచే అవకాశం లేదు కాబట్టే మోడీ ప్రకటన చేయలేదన్నారు. తెలంగాణలోని ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా ప్రకటన కూడా లేదని వినోద్ కుమార్ ఎద్దేవా చేశారు. పాత రహదారులకే కొత్త ప్రాజెక్ట్‌లుగా శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. విభజన హామీలపై ప్రధాని కనీసం మాట్లాడలేదని.. చివరికి మా నినాదాన్ని కూడా కాపీ కొట్టారని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ సభ ద్వారా బీజేపీ మరోసారి తెలంగాణ ప్రజలను వంచించిందన్నారు. మోడీ ఎక్కడికి వెళ్లినా అవినీతి అనే పదాలు లేకుండా మాటలు రావని.. విపక్ష పార్టీలు ఎక్కడున్నఆయన ఇలాంటి మాటలే మాట్లాడతారని వినోద్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గుజరాత్‌కు 20 వేల కోట్ల లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఇచ్చిన ప్రధాని.. తెలంగాణకు మాత్రం రూ.520 కోట్ల రైల్వే వ్యాగన్ రిపేర్ షాప్ పెట్టడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేని కేటీఆర్ దుయ్యబట్టారు. దేశ చరిత్రలోనే అత్యధిక నిరుద్యోగం సృష్టించిన ప్రధానిగా మోడీ నిలిచిపోతారని మంత్రి ఎద్దేవా చేశారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల 45 ఏళ్ల కల అని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణకు వచ్చిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలడం అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు ఏం చేస్తామో చెప్పకుండా ఉపన్యాసం ఇచ్చి వెళ్లడం పరిపాటిగా మారిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తే.. పకోడీలు వేసుకోవడం కూడా ఉద్యోగమేనని ప్రధాని హేళన చేశారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2.20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా , ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. లక్షలాది మందికి ఉద్యోగాలు అందించే ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌ను ప్రధాని కాగానే.. మోడీ రద్దు చేశారని మంత్రి గుర్తుచేశారు. దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో వున్న ఖాళీలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీని గవర్నర్ తమిళిసై తొక్కిపెట్టారని దుయ్యబట్టారు.
