Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ ఓట్లపై బీఆర్ఎస్, బీజేపీ కన్ను?.. చంద్రబాబు అరెస్టుపై కామెంట్లు

ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన పార్టీగా అప్రదిష్టపాలైనా సమైక్య రాష్ట్రంలో పలుమార్లు అధికారాన్ని చేపట్టిన టీడీపీకి ఇప్పటికీ తెలంగాణలో అక్కడక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. ఈ ఓటు బ్యాంకును కొల్లగొట్టాలని బీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి.
 

brs and bjp trying to woo tdp voters in telangana commenting on chandrababu arrest kms
Author
First Published Oct 16, 2023, 4:35 PM IST

హైదరాబాద్: ఏపీలో చంద్రబాబు అరెస్టు రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయ శ్రేణులు దాదాపుగా రెండుగా చీలిపోయాయి. ఒకటి వైసీపీ, మరొకటి టీడీపీగా విడిపోయి విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్టుపై రకరకాల వాదనలు వస్తున్నాయి. చంద్రబాబు అరెస్టుకు వైసీపీ రూట్ క్లియర్ చేయగా.. కేంద్రంలోని బీజేపీ తెరవెనుకగా ఉన్నదనే కామెంట్లు వస్తున్నాయి. దీనిపై అటు వైసీపీ, ఇటు బీజేపీ స్పందించలేదు. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్‌లోనూ ప్రకంపనలు వచ్చాయి. అయితే, ఇక్కడ నిరసనలను రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యతిరేకించారు. ఇక్కడ శాంతి భద్రతలకు భంగం కలగకూడదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయినా.. సమైక్య రాష్ట్రంలో పలుమార్లు అధికారంలోకి వచ్చిన టీడీపీకి రెండు చోట్లా పట్టు ఉన్నది. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించినందున తెలంగాణలో చాలా వరకు వ్యతిరేకత మూటగట్టుకున్నా.. ఇప్పటికీ అక్కడక్కడ టీడీపికి మంచి ఓటు బ్యాంకే ఉన్నది. కానీ, ఇక్కడ టీడీపీ బలంగా బరిలోకి దిగలేదు. దీంతో టీడీపీ ఓట్లపై సహజంగానే ఇతర పార్టీల కన్ను పడింది.

తెలంగాణలో టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉన్నదనే వాదనలను కౌంటర్ చేయాలని తెలంగాణ బీజేపీ భావిస్తున్నది. జాతీయ నేతలను కలువాలని ప్రయత్నించిన చంద్రబాబు అరెస్టు తనయుడు నారా లోకేశ్‌కు తొలుత నిరాశే ఎదురైంది. బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్ దొరకలేదు. బీజేపీపై ఆరోపణలు తీవ్రవమయ్యాయి. అయితే, ఈ వాదనలు టీడీపీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అడ్డంకిగా మారుతాయని బీజేపీ భావించినట్టు తెలుస్తున్నది. అందుకే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ద్వారా రాయబారం నడిపినట్టు అర్థం అవుతున్నది. కిషన్ రెడ్డి నారా లోకేశ్‌కు ఫోన్ చేసి కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఖరారు చేశారు. బీజేపీనే లోకేశ్‌ను ఢిల్లీకి పంపినదనే కథనాలూ వచ్చాయి. ఇది కేవలం టీడీపీ ఓటర్లను కాపాడుకోవడానికే అని కూడా విశ్లేషణలు వచ్చాయి.

Also Read: బీఆర్ఎస్ హామీల‌ను ఎవ‌రూ న‌మ్మ‌రు.. బీజేపీదే విజ‌యం : ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్

కాగా, బీఆర్ఎస్ కూడా చంద్రబాబు అరెస్టుపై ప్రతికూలంగా స్పందించి నష్ట నివారణ చర్యలకు పూనుకుంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఆందోళనలు చేయడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే.. ఆ తర్వాత బీఆర్ఎస్ తన వైఖరి మార్చుకుంది. దీంతో ఎన్టీఆర్‌ను కీర్తిస్తూ వచ్చారు. తండ్రి అనారోగ్యంగా ఉంటే ఉండే బాధ ఎలాంటిదో తనకు తెలుసు అంటూ కేటీఆర్.. నారా లోకేశ్‌కు సంఘీభావంగా కామెంట్ చేశారు. ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. బీజేపీ వ్యూహాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం కూడా ఉన్నదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios