దేశ ప్రజల ముందుకు విపక్షాల వాదన మాత్రం సమర్ధవంతంగా వెళ్లింది. ఫలితంగా గురువారం ఉభయ సభలూ మొదలైన దగ్గర నుండి ఏ సభలో కూడా పెద్ద నోట్ల రద్దుపై చర్చకు అధికార పార్టీ అనుమతించలేదు.

పెద్ద నోట్ల రద్దుపై చర్చ డిమాండ్ తో ఉభయ సభలూ దద్దరిల్లిపోయాయి. బుధవారం ప్రారంభమైన శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దు అంశమే ప్రధాన అజెండాగా విపక్షాలు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అనుకున్నట్లుగానే గురువారం ఉదయం ఉభయ సభలూ ప్రారంభం అవుతూనే విపక్షాల సభ్యులు పెద్ద నోట్ల రద్దుపై చర్చకు పట్టుబట్టాయి. అయితే, లోక్సభలో స్పీకర్ గానీ, రాజ్యసభలో డిప్యూటి ఛైర్మన్ గాని అనుమతించకపోవటంతో సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.

వెయ్యి, 500 రూపాయల నోట్లను హటాత్తుగా రద్దు చేయటం, తదనంతర పరిణామాలపై ఎన్ డిఏ ప్రభుత్వాన్ని విపక్షాలు బుధవారమే రాజ్యసభలో కడిగిపారేసాయి. విపక్షాల ప్రశ్నలకు, ఆరోపణలకు కేంద్రమంత్రులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దేశ ప్రజల ముందుకు విపక్షాల వాదన మాత్రం సమర్ధవంతంగా వెళ్లింది. దాంతో ప్రభుత్వం బాగా ఇబ్బందిపడింది. దాని ఫలితంగా గురువారం ఉభయ సభలూ మొదలైన దగ్గర నుండి ఏ సభలో కూడా పెద్ద నోట్ల రద్దుపై చర్చకు అధికార పార్టీ అనుమతించలేదు.

గడచిన తొమ్మిది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న ఇంతటి సమస్యపై ప్రభుత్వం చర్చకు అనుమతించలేదంటేనే ఏ స్ధాయిలో భాజపా ఇబ్బందులు పడుతున్నదో అందరికీ అర్ధమవుతోంది. అసలు దేశ ఆర్ధిక వ్యవస్ధ గందరగోళంలో పడటానికి దారితీసిన తన నిర్ణయంపై సభకు సమాధానం చెప్పటానికి ఇష్టం లేనట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఉభయ సభల్లోనూ ఎక్కడా కనబడకపోవటం గమనార్హం.

ఉభయ సభల్లోనూ విపక్షాల సభ్యులు ఇటు స్పీకర్, అటు డిప్యూటి ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి జాతిని కుదిపేస్తున్న నోట్ల రద్దు వ్యవహారంపై చర్చకు అనుమతించాల్సిందేనంటూ పదే పదే డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. దాంతో ప్రతిపక్షాల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా నినాదాలు చేస్తూ పోడియంల వద్దనే ఉండిపోయారు. లోక్ సభ సజావుగా సాగే అవకాశం లేకపోవటంతో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేసారు.