తెలంగాణలో ఇద్దరు పురుషులకు పెళ్లి.. తల్లిదండ్రుల నుంచీ గ్రీన్ సిగ్నల్.. వివరాలివే
హైదరాబాద్‌లో తొలిసారి ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన సుప్రియో, అభయ్‌లు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వారి పెళ్లి కోసం తల్లిదండ్రులనూ ఒప్పించారు. త్వరలోనే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు. హైదరాబాద్‌లో వీరిదే తొలి స్వలింగ సంపర్కం వివాహం కానుంది.
హైదరాబాద్: వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా.. నిజమే. తెలంగాణలో ఇద్దరు పురుషులు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇద్దరు పురుషులు Marriage చేసుకుని ఒక్కటవ్వనున్నారు. ఈ ఇద్దరు (Same sex) ఓ Dating Appలో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. అనంతరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు వారి తల్లిదండ్రులూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
స్వలింగ సంపర్కుల వివాహం ఇది వరకు మన Telanganaలో జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడిప్పుడే స్వలింగ సంపర్కంపై అవగాహన ఏర్పడుతున్నది. ముఖ్యంగా సుప్రీంకోర్టు సెక్షన్ 377పై చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాత చర్చ కొంత తీవ్రత సంతరించుకున్నది.
వ్యక్తుల లైంగిక స్వభావమన్నదని అంతర్గతమైనదని, ఒకరు ఇంకొకరిపై ఆకర్షితం కావడమనేది నియంత్రణలో లేనిదని సుప్రీంకోర్టు తెలిపింది. దానిని అణచివేయడమంటే వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని స్పష్టం చేసింది. శరీర లక్షణాలు వ్యక్తిగతమైనవని, అవి వాళ్ల ఆత్మగౌరవంలో భాగమని పేర్కొంది. కాబట్టి, సెక్షన్ 377 అనేది ఆర్టికల్ 14 ఉల్లంఘనే అని వివరించింది. స్వలింగ సంపర్కం నేరమనే సెక్షన్ 377 వ్యక్తిగత స్వేచ్ఛను ప్రసాదించే ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తున్నదని తెలిపింది.
అంతేకాదు, ఎల్జీబీటీలను వేధించడానికి సెక్షన్ 377 ఒక ఆయుధంగా మారిందని, ఈ సెక్షన్ అహేతుకమైదని అత్యున్నత న్యాయ స్థానం వివరించింది. కాబట్టి, ఇతర పౌరుల్లాగే ఎల్జీబీటీ కమ్యూనిటీకి లైంగిక హక్కులుంటాయని పేర్కొంది.
ఈ తీర్పు తర్వాత దేశవ్యాప్తంగా ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్)లపై చర్చ జరిగింది. తెలంగాణ కంటే ముందు ఇతర రాష్ట్రాల్లో స్వలింగ సంపర్కుల వివాహాలు జరిగాయి. మహారాష్ట్రలో 2018లో ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకున్నారు. తాజాగా, తెలంగాణలోనూ ఇలాంటి వివాహ వార్త వినిపిస్తున్నది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
సుప్రియో, అభయ్ అనే ఇద్దరు స్వలింగ సంపర్కులు ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. తొలుత మిత్రులుగా మాట్లాడుకునేవారు. కొంత కాలం ఫ్రెండ్స్‌గానే కొనసాగారు. తర్వాత వారు ప్రేమలో పడ్డారు. ఇలా ఎనిమిదేళ్లు వారు ప్రేమించుకున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని చివరకు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వీరిద్దరూ హైదరాబాద్‌కు చెందినవారే కావడం గమనార్హం. హైదరాబాద్‌లో స్వలింగ సంపర్కుల పెళ్లి జరగడం ఇదే తొలిసారి కానుంది.
Also Read: ఇద్దరూ పురుషులే: 8 ఏళ్ల కాపురం తర్వాత తేలింది
ఇలాంటి వివాహం గురించి వినడమే ఆశ్చర్యకరంగా ఉంటే ఈ పెళ్లికి వారి తల్లిదండ్రులూ ఆమోదం తెలుపడం మరో ఆశ్చర్యకరమైన విషయంగా మారింది. సుప్రియో, అభయ్‌లు వారి పెళ్లికి తల్లిదండ్రులను ఒప్పించగలిగారని తెలిసింది. చివరకు తల్లిదండ్రులూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే వీరు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. మంగళస్నానాలు, ఉంగరాలు మార్చుకునే తంతు వంటివన్నీ వీరు నిర్వహించుకోబోతున్నట్టు తెలిసింది. వీరి పెళ్లి విషయమై ఇప్పుడు సోషల్ మీడియాలో మోతమోగిపోతున్నది. ఇప్పుడు ఈ టాపిక్ రాష్ట్రమంతా ఆసక్తిని రేపుతున్నది.