తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు .. సర్వేల్లో కాంగ్రెస్ జోరు, బీజేపీ లాస్ట్ వెపన్ బయటకు తీసిందా..?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు, వారి బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపాయి. హైదరాబాద్ నార్సింగ్‌లోని కేఎల్ఆర్ నివాసంలో నేటికీ ఐటీ సోదాలు కొనసాగుతూనే వున్నాయి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు భయాందోళనలకు గురిచేసేందుకు వ్యూహాత్మకంగా కమలనాథులు ఈ దాడులు చేయిస్తున్నారని హస్తం నేతలు మండిపడుతున్నారు.
త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు వున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ను నిలువరించేందుకు బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ కూడా రేసులో ముందు నిలిచేందుకు అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు, వారి బంధువుల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం రేపాయి.
హైదరాబాద్ నార్సింగ్‌లోని కేఎల్ఆర్ నివాసంలో నేటికీ ఐటీ సోదాలు కొనసాగుతూనే వున్నాయి. గురువారం రాత్రి 1 గంట వరకు ఐటీ బృందం సోదాలు నిర్వహించిన దొరికిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. అయితే ఇది బీజేపీ పనేనని.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభ్యర్ధుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు భయాందోళనలకు గురిచేసేందుకు వ్యూహాత్మకంగా కమలనాథులు ఈ దాడులు చేయిస్తున్నారని హస్తం నేతలు మండిపడుతున్నారు.
కల్వకుంట్ల కుటుంబం, బీఆర్‌ఎస్ నేతలు ఈ పదేళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపణలు వస్తున్నా బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే ప్రతి సభలోనూ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దేశంలోని విపక్షనేతలపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరుగుతున్నాయని.. కానీ కేసీఆర్ ఇంటి దరిదాపుల్లోకి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు వెళ్లడం లేదని రాహుల్ మండిపడుతున్నారు.
ALso Read: జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు: రెండో రోజూ కాంగ్రెస్ నేతల ఇళ్లలో సాగుతున్న దాడులు
అలాగే ఒవైసీ కుటుంబ సభ్యులపైనా అవినీతి ఆరోపణలు వచ్చినా ఇన్‌కమ్ ట్యాక్స్ దాడులు జరగలేదు. ఏపీలో సీఎం జగన్ అవినీతిపై అమిత్ షా, జేపీ నడ్డా బహిరంగంగా విమర్శలు గుప్పించినా గత పదేళ్లలో ఆయనపై కానీ, ఆయన పార్టీ నేతలపైనా ఎలాంటి ఐటీ దాడులు జరగలేదు. కేసీఆర్, ఒవైసీ, జగన్‌పై ఆదాయపు పన్ను దాడులు ఉండవని, సీబీఐ, ఈడీలు కూడా కేసులు పెట్టబోవని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి అదనంగా జగన్‌పై గతంలో ఉన్న సీబీఐ, ఈడీ కేసులు ఏమాత్రం ముందుకు సాగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు కూడా.
తాజాగా కాంగ్రెస్‌ను కంట్రోల్ చేసేందుకు కూడా బీజేపీ ఐటీ దాడులు చేయిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బీజేపీ తన మిత్రపక్షాల మీద ఈగ వాలనీవ్వడం లేదని.. కానీ ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడుతోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలకు కమలనాథులు ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాలి.