కొత్త టీమ్ కోసం కిషన్ రెడ్డి కసరత్తు: 15 జిల్లాల అధ్యక్షుల మార్పు
తెలంగాణలో పార్టీ ప్రక్షాళనపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కించుకోలేకపోయిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీని ప్రక్షాళన చేయాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి భావిస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది.
2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. మరో 19 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించకపోవడానికి ఆ పార్టీ నాయకుల తప్పిదం కూడ కారణంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ రాష్ట్ర నాయకుల సమావేశంలో నేతలకు క్లాస్ తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలా జరగవద్దని కూడ అమిత్ షా పార్టీ నేతలకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికలపై కేంద్రీకరించాలని అమిత్ షా పార్టీ నేతలను కోరారు.
తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 12 స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతుంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం పార్టీలో ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లో జిల్లా అధ్యక్షులను మార్చాలని కిషన్ రెడ్డి భావిస్తున్నారు. మరో వైపు రాష్ట్ర పదాధికారులను మార్చే అవకాశం ఉంది.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024: తెలంగాణకు అమిత్ షా, ఆ స్థానాలే టార్గెట్
దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. కర్ణాటకలో అధికారంలో కోల్పోవడంతో తెలంగాణపై ఆ పార్టీ కేంద్రీకరించింది. తెలంగాణలో నాయకుల మధ్య సమన్వయంపై పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టనుంది. పార్టీ కోసం పనిచేసే నాయకులకే పార్టీ పదవులను కట్టబెట్టనుంది.
క్షేత్ర స్థాయి నుండి పార్టీ ప్రక్షాళన కార్యక్రమంపై బీజేపీ నాయకత్వం కేంద్రీకరించనుంది. పార్లమెంట్ ఎన్నికలకు కొత్త టీమ్ తో వెళ్లాలని కిషన్ రెడ్డి తలపెట్టారు.
also read:పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైంది. తెలంగాణలో తొలి సారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ చోటు చేసుకొనే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొనేందుకు గాను ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు వ్యూహలకు పదును పెడుతున్నాయి.
ప్రస్తుతం బీజేపీలోని నలుగురు సిట్టింగ్ లకు సీట్లు ఖాయం. అయితే మిగిలిన 13 స్థానాల్లో సరైన అభ్యర్థుల కోసం బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. అయితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేతలు ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.