చీమలపాడు  భీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో  పేలుడుతో  ఇద్దరు మృతి చెందడంపై   బీజేపీ మండిపడింది. ఈ ఘటనకు  బాధ్యులపై  కేసు పెట్టాలని  బండి సంజయ్ డిమాండ్  చేశారు. 

హైదరాబాద్: ఖమ్మం జిల్లా చీమలపాడులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యంవల్ల ఇద్దరు మృతి చెందారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

also read:పువ్వాడ, నామాకు కేసీఆర్ ఫోన్: కారేపల్లి ప్రమాదంపై ఆరా

మరో వైపు మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లు కారణంగా ఒకరు మృతి చెందిన ఘటనపై ఆయన స్పందించారు. ఈఘటన సహించరాని నేరంగా బండి సంజయ్ పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన చెప్పారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జిల్లాలో విచ్చలవిడిగా కల్తీకల్లు రాజ్యమేలుతుంటే మంత్రి ఏం చేస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.తక్షణమే బాధ్యులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కల్తీకల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు.