Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు షాకిచ్చేలా బీజేపీ స్కెచ్.. నడ్డా నివాసంలో కీలక భేటీ, త్వరలోనే తొలి జాబితా

ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు . ప్రధానంగా తెలంగాణలో అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో రూపకల్పన, అగ్రనేతల ప్రచారంపై మంతనాలు జరిపారు . త్వరలోనే తొలి జాబితా కింద 70 మంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

BJP Telangana core group continues brainstorming at JP nadda residence ksp
Author
First Published Oct 19, 2023, 8:41 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఎన్నికల షెడ్యూల్ రావడానికి రెండు నెలల ముందే 115 మంది అభ్యర్ధుల జాబితాను ప్రకటించి కేసీఆర్ అందరికి షాకిచ్చారు. కాంగ్రెస్ తేరుకుని ఇటీవలే 55 మందితో తొలి జాబితా ప్రకటించింది. ఎటోచ్చి బీజేపీ సంగతే అంతు చిక్కడం లేదు. ఎన్నికలకు నెల రోజులే గడువు వుండటంతో ఇంకా అభ్యర్ధులు ఖరారు కాలేదు. దీంతో నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార పార్టీ తరపున కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలు రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ సైతం అగ్రనేతలను రంగంలోకి దించింది. బీజేపీ అభ్యర్ధులు ఖరారు కాకపోవడంతో ముందు ఈ పని తేల్చే పనిలో నేతలు బిజీగా వున్నారు. 

ఈ నేపథ్యంలో కమలనాథులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ సహా కీలక నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపైనే నేతలు చర్చించారు. మేనిఫెస్టో రూపకల్పన, అగ్రనేతల ప్రచారంపై మంతనాలు జరిపారు. కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టే వ్యూహాన్ని కమలనాథులు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే తొలి జాబితా కింద 70 మంది అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Also Read: ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు ఆగింది: రాహుల్ కు కిషన్ రెడ్డి కౌంటర్

అంతకుముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో మార్పు రావాలంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఆలే శ్యామ్ జీని పార్టీలో తీసుకోవాలన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి అందరం కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే అభివృద్ది జరుగుతుందని ప్రజల్లో చర్చ జరుగుతుందని అన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉందని.. తెలంగాణలో బీజేపీకి ఒక శక్తి అవసరమని పేర్కొన్నారు. ప్రధాని మోదీలో ఉన్న మంచితనం ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చిందని అన్నారు. 

తెలంగాణ బీజేపీలోకి ఈ సమయంలో ఆర్ఎస్ఎస్‌లో ఉన్న ఒక మంచి వ్యక్తి వస్తే  బాగుంటుందని అన్నారు. ఒకప్పుడు టైగర్ నరేంద్ర(ఆలే నరేంద్ర) అంటే.. ఎంఐఎం గానీ, అప్పుడున్న ప్రభుత్వాలు గానీ భయపడేవని అన్నారు. ఆర్ఎస్ఎస్‌లో ఉన్న టైగర్ నరేంద్ర సోదరుడు ఆలే శ్యామ్ జీ‌ని బీజేపీలోకి పంపిస్తే తెలంగాణ పార్టీ మరింత బలంగా మారుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. దీనిని బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆలోచన చేయాలని కోరారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios