ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు ఆగింది: రాహుల్ కు కిషన్ రెడ్డి కౌంటర్
బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ కౌంటరిచ్చారు.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీయే కలిసి పనిచేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు.
బస్సుయాత్రను ప్రారంభించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 18న తెలంగాణకు వచ్చారు.ములుగులో బస్సు యాత్రను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఇవాళ రెండో రోజూ భూపాలపల్లి నుండి బస్సు యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. రెండు రోజులుగా బీజేపీ, బీఆర్ఎస్ లపై రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్నారు.బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకటేనని ఆయన ఆరోపించారు.ఈ విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
గురువారంనాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ తో కలిసి పనిచేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాహుల్ గాంధీ తమపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ బీ టీమే బీఆర్ఎస్ అని ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు గతంలో బీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
also read:ఢిల్లీకి కిషన్ రెడ్డి సహా కీలక నేతలు: నేడు బీజేపీ తొలి జాబితాకు అవకాశం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఉన్న ఓటుకు నోటు కేసును ఎందుకు తొక్కి పెట్టారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఎవరిని ఎవరు కాపాడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసునని కిషన్ రెడ్డి చెప్పారు.