కేసీఆర్ కుటుంబంపై ఉచ్చు బిగుస్తోంది... బావతో కలిసే కవితక్క జైలుకు : బిజెపి ఎంపీ అరవింద్
బిఆర్ఎస్, బిజెపి ఒక్కటేనని... అందువల్లే డిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడంలేదంటూ జరుగుతున్న ప్రచారంపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు.

జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుసుకుటోందని బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని చెప్పారని నిజామాబాద్ ఎంపీ గుర్తుచేసారు. కవితక్క ఒంటరిగా కాకుండా బావతో కలిసి జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు వున్నారు... అందువల్లే ఆయన పేరు కూడా బయటకు వస్తోందని అరవింద్ పేర్కోన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. బిఆర్ఎస్ కు బిజెపి బి టీమ్ అంటూ జరుగుతున్నది తప్పుడు ప్రచారమని... కేసీఆర్ కుటుంబాన్ని శిక్షిస్తామని అంటున్న మేమెలా బి టీమ్ అవుతామన్నారు. బిఆర్ఎస్ కు కాంగ్రెస్సే బి టీమ్... 2014, 18 లో మూడో వంతు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి వెళ్లకుండా గ్యారంటీ ఇస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా బీఆర్ఎస్ లో చేరరని అరవింద్ స్పష్టం చేసారు.
తెలంగాణ బిజెపి అధ్యక్ష మార్పుపైనా అరవింద్ స్పందించారు. ఇది పూర్తిగా అధిష్టానం నిర్ణయమేనని... అధ్యక్షుడు ఎవరైనా రాష్ట్రంలో బిజెపిని అధికారంలోక తీసుకురావడమే లక్ష్యమని అరవింద్ పేర్కొన్నారు.
Read More కొత్త అధ్యక్షుడు వచ్చినా టీబీజేపీలో మారని పరిస్థితులు! తొలి కార్యక్రమం టిఫిన్ బైఠక్‌లో కానరాని జోష్
ఇక ఇటీవల కవిత రాజకీయ భవిష్యత్ పై అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన కూతురుని రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కాకుండా మెదక్ నుండి పోటీ చేయించాలని కేసీఆర్ చూస్తున్నారని అరవింద్ తెలిపారు. గతంలో మాదిరిగానే నిజామాబాద్ లో బిఆర్ఎస్ గెలుపు సాధ్యంకాదని తెలిసే కేసీఆర్ నిర్ణయానికి వచ్చారన్నారు. మరోసారి తనబిడ్డ ఓడిపోరాదని జాగ్రత్తపడుతున్న కేసీఆర్ నిజామాబాద్ నుండి మెదక్ కు షిప్ట్ చేస్తున్నాడని అరవింద్ అన్నారు.
అయితే కవిత తన తండ్రి కేసీఆర్ మాట వినకుండా మరోసారి నిజామాబాద్ లోనే పోటీచేయాలని అరవింద్ కోరారు. మెదక్ కు పారిపోకుండా నిజామాబాద్ లోనే పోటీచేసి గెలిచి చూపించాలని బిజెపి ఎంపీ సవాల్ విసిరారు. కవిత రాజకీయాలు నిజామాబాద్ లో సాగవని... ఆమెను మరోసారి ఓడించాలన్న కసితో ఇక్కడి ప్రజలు వున్నారన్నారు. ఇది గుర్తించిన కేసీఆర్ కూతుర్ని మరోచోట పోటీ చేయించాలని చూస్తున్నాడని అరవింద్ అన్నారు.