కొత్త అధ్యక్షుడు వచ్చినా టీబీజేపీలో మారని పరిస్థితులు! తొలి కార్యక్రమం టిఫిన్ బైఠక్‌లో కానరాని జోష్
టీబీజేపీలో కానరాని జోష్.. కొత్త అధ్యక్షుడు వచ్చినాక తొలి కార్యక్రమంలోనే కనిపించని ఐక్యత. కిషన్ రెడ్డి అధ్యక్షుడయ్యాక టిఫిన్ బైఠక్ కార్యక్రమాన్ని ప్రకటించారు. కానీ, ఆదివారంనాటి ఈ కార్యక్రమంలో నేతలు నామమాత్రంగానే నిర్వహించారు. చాలా చోట్ల ఈ కార్యక్రమ హడావుడి కనిపించనే లేదు.

హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర యూనిట్‌కు కొత్త అధ్యక్షుడిని నియమించినా పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించలేదు. టీబీజేపీ అధ్యక్షుడిగా కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి నియామకమైన తొలి కార్యక్రమంగా టిఫిన్ బైఠక్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహిస్తామని, కీలక నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని టీబీజేపీ చెప్పింది. కానీ, అది ఆచరణలో కనిపించలేదు.
టీబీజేపీ ఆదివారం టిఫిన్ బైఠక్ నిర్వహించింది. కానీ, ఆశించిన హడావుడి మాత్రం కనిపించలేదు. అక్కడక్కడా పరిమితస్థాయిలోనే ఈ కార్యక్రమాలు జరిగాయి. పార్టీ నేతలూ ఏదో చేశామా? అంటే చేశాం అన్నట్టుగా టిఫిన్ బైఠక్ కార్యక్రమాలు నిర్వహించినట్టు అర్థమవుతున్నది. కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడయ్యాక ఫస్ట్ ప్రోగ్రామ్, పార్టీ నేతలు తామంతా ఐక్యంగా ఉన్నామని సంకేతాలు ఇవ్వాల్సిన కార్యక్రమం కాస్తా నీరుగారిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో టీబీజేపీలో ముసలం తొలగిపోలేదు. గ్రూపులూ ఇంకా కొనసాగుతున్నాయని, ఐక్యత ఇంకా ఏర్పడలేదనీ అవగతం అవుతున్నది.
Also Read: ఆగస్టులో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీలో కొన్ని వర్గాలు ఏర్పడ్డాయి. నాయకత్వంతో వారు విభేదించారు. ఏకంగా ఢిల్లీ పెద్దలకూ రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదులు చేశారనే వార్తలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విభేదాలు పక్కనపెట్టి అందరినీ కలుపుకుపోయే నేతను అధ్యక్షుడిని చేయాలనే ఉద్దేశంతో కిషన్ రెడ్డిని ఎంచుకున్నట్టు అభిప్రాయాలు ఉన్నాయి. కానీ, కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా టీబీజేపీలో పెద్ద మార్పు కనిపించడం లేదన్నది రాజకీయవర్గాల మాట.