ఎంఐఎంపై తెలంగాణ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. సోమవారం ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించిన ఆయన.. హిందూ ఆలయాల అభివృద్ధికి నిధులు అడిగే హక్కు ఎంఐఎంకు లేదని ఆయన మండిపడ్డారు.

హిందూ వ్యతిరేకి అనే మచ్చను తొలగించుకునేందుకే మజ్లిస్ నేతలు ప్రయత్నిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. గతంలో హిందువులు, గోవులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాకే దేవాలయాల అభివృద్ధి గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Also Read:కారణమిదే:కేసీఆర్‌తో అక్బరుద్దీన్ భేటీ

పాతబస్తీలోని కాళీమాత ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసునని.. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే అక్బరుద్ధీన్ ఒవైసీ ప్రగతి భవన్‌కు వెళ్లారని రాజాసింగ్ ఆరోపించారు.

చంద్రశేఖర్ రావు ఎంఐఎంకు కాకుండా తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, అదే ఎంఐఎం నేతలకు మాత్రం అడగకుండానే అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆదివారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని అక్బరుద్దీన్ ..కె.చంద్రశేఖర్ రావును కోరారు. 

Also Read:జగిత్యాల ప్రజలే బామ్మర్దులకు బుద్దిచెప్పాలి: ఓవైసి బ్రదర్స్ పై విరుచుకుపడ్డ రాజాసింగ్

ప్రతీ ఏటా ఈ దేవాలయంలో నిర్వహించే బోనాలు దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ చాలినంత స్థలం లేకపోవడం వల్ల, దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని సిఎం దృష్టికి తెచ్చారు.

లాల్ దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారు. కానీ ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉందన్నారు.