Asianet News TeluguAsianet News Telugu

కారణమిదే:కేసీఆర్‌తో అక్బరుద్దీన్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆదివారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. 

Mim mla akbaruddin owaisi meets cm kcr
Author
Hyderabad, First Published Feb 9, 2020, 5:19 PM IST

హైదరాబాద్: పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కోరారు. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆయన విజ్ఞాపన పత్రం అందచేశారు. 

ప్రతీ ఏటా ఈ దేవాలయంలో నిర్వహించే బోనాలు దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ చాలినంత స్థలం లేకపోవడం వల్ల, దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని సిఎం దృష్టికి తెచ్చారు.

లాల్ దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారు. కానీ ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉందన్నారు. 

ఇంత తక్కువ స్థలం ఉండడం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతున్నది. దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయండి. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశం ఉందని అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. 

వారికి ప్రత్యామ్నాయంగా జిహెచ్ఎంసి ఆధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వాలని ఆయన కోరారు. . దేవాలయన్ని విస్తరించి, అభివృద్ధి చేయడాన్ని అత్యంత ముఖ్యమైన పనిగా భావించండి. ఇది భక్తులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అక్బరుద్దీన్ సిఎంను కోరారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ కావాలని దీవించాలని కోరుతూ ఈ దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బంగారు బోనం సమర్పించిన విషయాన్ని అక్బర్ గుర్తు చేశారు. 

పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మస్జీద్ మరమ్మతుల కోసం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ సిఎం కేసీఆర్ ను కోరారు. ఎంతో మంది ముస్లింలు నిత్యం ఈ మసీదులో ప్రార్థనలు చేస్తారని, మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతున్నదని ఆయన సిఎం దృష్టికి తెచ్చారు. 

అక్బరుద్దీన్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios