'ఉపాధ్యాయ' ఎమ్మెల్సీ ఎన్నికలో షాకింగ్ ఫలితాలు.. బీజేపీ అభ్యర్థి ఎవీఎస్ రెడ్డి గెలుపు
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగింది. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు.

అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు సెమీస్ గా భావిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరించనున్నది. ఇంతకీ పబ్లిక్ పల్స్ ఎలా ఉంది అనే అంశాలను అంచనా వేయడంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు వెలువడ్డాయి. మరోసారి అధికారంలో వస్తామని గెలుపు పైన అధికార బీఆర్ఎస్ ధీమాగా ఉన్న క్రమంలో షాకింగ్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి.
ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగింది. గురువారం అర్ధరాత్రి దాటాక వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో గెలుపు పొందారు.
ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అధ్యంతం ఉత్కంఠగానే సాగింది. గురువారం అర్ధరాత్రి 1.40 గంటల వరకు ఎన్నికల లెక్కింపు జరిగింది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. ఏ పార్టీ అభ్యర్థికీ సరైన మెజార్టీ రాలేదు. అంటే 50 శాతం మించి ఓట్లు పడలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్ రెడ్డి విజయం ఖరారైంది. వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.