చార్జీలు, ఫీజులు, బకాయిలకు అవకాశం ఈ నెల 24 వరకు అవకాశం
ప్రభుత్వానికి చేయాల్సిన ఎలాంటి చెల్లింపులైనా ఈ నెల 24 వరకు రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లతో కూడా చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లుప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఒక ప్రకటనలో ప్రజలకు సూచించారు.
పాత రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు, చార్జీలు, పన్నులు, ఫెనాల్టీలు ఈ నెల 24 వరకు పాత కరెన్సీ నోట్లతో చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు చెల్లించాల్సిన ఫీజులు, చార్జీలు, పన్నులు, ఫెనాల్టీలు ఎవైనా ఈ నెల 24 వరకు పాత కరెన్సీతో చేయవచ్చని రాజీవ్ శర్మ స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్లు చేయించుకోనే వారు, వాణిజ్య పన్నులు కట్టే వారు, మంచినీటి బిల్లు చెల్లించే వారు, విద్యుత్ బకాయిలు కట్టే వారు కూడా పాత నోట్లను ఉపయోగించవచ్చని తెలిపారు. పాత కరెన్సీని స్వీకరించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్లు, ఇతర అధికారులు కూడా ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
