Nirmala Sitharaman: కేంద్ర ప్రభుత్వ పాలసీలతోనే హైదరాబాద్‌కు కంపెనీలు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలను పట్టించుకోని ఈ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అధికారం ఇవ్వాలని ప్రశ్నించారు. కేంద్ర ప్రభత్వ పాలసీల వల్లే హైదరాబాద్‌కు మంచి కంపెనీలు వస్తున్నాయని తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ తారాస్థాయిలో జరుగుతున్నది. అన్ని పార్టీల నేతలు, అధినేతలు ప్రచారంలో దూకారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ వచ్చారు. బీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్ తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీల వల్లే హైదరాబాద్‌కు మంచి మంచి కంపెనీలు వస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని మధురా నగర్‌లో నిర్వహించిన మీట్ ది గ్రీట్ కార్యక్రమంలో కేంద్రమంత్రి పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచి పెడుతున్నదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు సహకరించడం లేదని ఆరోపించారు. తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వ సర్వవిధాల భ్రష్టు పట్టించిందని అన్నారు.
Also Read: కరీంనగర్‌లో గంగుల, బండి మధ్య మాటల యుద్ధం.. ‘నిన్నెందుకు గెలిపించాలి?’
బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అని, అవినీతికి పాల్పడుతున్న పార్టీ అని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ప్రజలకు పని చేయని ఇలాంటి పార్టీతో ఏం పని అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు తగ్గకపోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వ విధానమే కారణం అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినా కేసీఆర్ ప్రభుత్వం దాని మీద వ్యాట్ తగ్గించలేదని అన్నారు. బీజేపీ మాత్రం కేంద్రంలో సమర్థవంత పాలనను అందిస్తున్నదని, ప్రతిపక్ష నేతలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారని వివరించారు.