హైదరాబాద్: గుంటూరు శ్రీనుతో కలిసి మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ సెటిల్ మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను నేరచరితపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

హైదరాబాదులో ఉంటున్న గుంటూరు శ్రీను మూడేళ్ల క్రితం భార్గవ్ రామ్ పరిచమయ్యాడని, అప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగిందని భావిస్తున్నారు. గుంటూరు శ్రీను వివాదాల్లో తలదూర్చడానికి, అవసరమైతే దాడులు చేయడానికి వెనకాడబోడని, దాంతో అతని సాయంతో భూమా అఖిలప్రియ దంపతులు హైదరాబాదులో భూవివాదాలు పరిష్కరిస్తూ వచ్చారని పోలీసులు అనుకుంటున్నారు. 

Also Read: భూమా అఖిలప్రియ బెదిరింపులు: గుంటూరు శ్రీనుతో కలిసి భార్గవ్ రామ్ ప్లాన్

అఖిలప్రియ, భార్గవ్ రామ్ వివాహం తర్వాత గుంటూరు శ్రీను వారికి వ్యక్తిగత సహాయకుడిగా మారినట్లు పోలీసులు గుర్తించారు. గుంటూరు శ్రీనుతో కలిసి అమరావతి, మంగళగిరి, కర్నూలుల్లో సెటిల్ మెంట్లు చేశారని పోలీసులు నిర్ధారించుకున్నారు. 

కర్నూలు జిల్లా కోటకందుకూరిలోని ఓ స్టోన్ క్రషర్ ను దౌర్జన్యంగా ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ రావును, ఆయన సోదరులను కిడ్నాప్ చేయడంతో భార్గవ్ రామ్ వ్యవహారాలు బయటకు వస్తున్నాయి.