తెలంగాణ పల్లెల్లో కొత్త ఉపాధినిస్తున్న బతుకమ్మ చీరలు బొంతల పరిశ్రమలో బతుకమ్మ చీరల వినియోగం
తెలంగాణ సర్కారు చేనేతకు చేయూతనిచ్చే సదుద్దేశంతో తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. కోటికి పైగా చీరలను కానుకగా అందించింది సర్కారు. దీనిద్వారా తెలంగాణలోని చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పర్వదినాన కానుక ఇచ్చినట్లవుతుందని సర్కారు ఈ పథకం తీసుకొచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ ద్వారా మహిళాలోకం ఆదరాభిమానాలు దక్కుతాయని సర్కార్ ఆశించింది. అయితే కారణాలేమైనా ఆశించిన మేరకు సర్కారుకు అభినందనలు దక్కలేదు. చేనేతకు భరోసా ఇచ్చే ఉద్దేశంతో బతుకమ్మ చీరలు అందజేస్తున్నట్లు ముందుగా సర్కారు చెప్పినా... సింహభాగం చీరలు సూరత్ నుంచి తెచ్చన సిల్క్ చీరలే కావడంతో మహిళా లోకం ఆగ్రహావేశాలు వెల్లగక్కింది. బతుకమ్మ చీరల పథకానికి సర్కారు భారీ స్థాయిలో ప్రచారం కల్పించడం ద్వారా మహిళల్లో హైప్ క్రియేట్ చేసింది. దీంతో ఆ చీరలు ఎంత బాగుంటాయో? ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అని మహిళలు ఎదురుచూశారు. తీరా చీర తీసుకున్నాక ఉసూరుమన్నారు.
అయితే ఆచరణలో సర్కారు ఆశించిన రీతిలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగలేదు. పాలిస్టర్, సిల్క్ చీరలు పంపిణీ చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. కొన్నిచోట్ల చీరల దహనాలు కూడా జరిగాయి. అయినప్పటికీ ఈచీరలు తీసుకోబోము అంటూ ఎవరూ పెద్దగా తిరస్కరించిన దాఖలాలు లేవు. హడావిడి జరిగినా మహిళలందరూ చీరలు తీసుకుని వెళ్లిపోయారు.
అయితే ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో బొంతలు కుట్టుకునే వారికి గిరాకీ బాగా పెరిగింది. గతంలో బొంతలు కుట్టే వారు గ్రామాల్లో తిరిగి పాత చీరలు సేకరించి బొంతలుగా కుట్టి ఇచ్చేవారు. బొంత కుట్టినందుకు చార్జీ తీసుకునేవారు. లేదంటే గ్రామాల్లో పాత చీరలన్నీ తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని బొంతలుగా మార్చి విక్రయించే వారు కూడా ఉంటారు. ఈ బతుకమ్మ చీరల పుణ్యమా అని బొంతలు కుట్టే వారికి డిమాండ్ అమాంతం పెరిగిందని చెబుతున్నారు. కొందరు ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ తక్కువ ధరకు ఆ బతుకమ్మ చీరలను కొనుగోలు చేసి బొంతలు తయారు చేసి అమ్మకానికి పెడుతున్నారు. కొందరేమో పంట పొలాల్లో అడవి పందులు రాకుండా ఉండేందుకు పొలం చుట్టూ ఈ చీరలను వాడుతున్నట్లు చెబుతున్నారు.
మొత్తానికి బతుకమ్మ చీరల మహిమతో తెలంగాణ లో బొంతల కొరత తీరిపోయిందని జనాలు చమత్కరిస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
